POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 11:22 am Posted by : POLITICAL POWER

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్

తేదీ: 12-08- 2026(బుధవారం)

వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడం పై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితులు జంతువులను వేటాడుతున్నారన్న సమాచరంతో వారిని పట్టుకునేందుకు మరో ముగ్గురు బీట్ ఆఫీసర్లతో కలిసి వెళ్ళిన నవీన్ బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఈ ఘటన పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నవీన్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు డిఎఫ్ఓ మంత్రికి వివరించారు.

 

అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ సిబ్బంది పోషిస్తున్న పాత్ర అసమాన్యమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తుల వల్ల వన్యప్రాణులతో పాటు అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతున్నదని మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

 

మృతిచెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి మంత్రి సురేఖ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం మృతుడు నవీన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ పిసిసిఎఫ్ వినయ్ కుమార్ ను ఆదేశించారు.