POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:12 pm Posted by : POLITICAL POWER

*స్థానిక ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు!!

  •  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పి ఎన్ 9 టివి తెలుగున్యూస్ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి  : స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు.

    మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్‌ జగన్‌.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

*ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులు*
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలి!

*ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయం*
ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్‌ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు!

*గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం*
“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైయస్సార్‌సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్‌, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి!

*14–15 లక్షల గుర్తింపు కార్డులు*
పార్టీ కేడర్‌ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్‌కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్‌ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం!

*లీగల్‌, మీడియా సెల్స్‌ యాక్టివ్‌గా ఉండాలి*
ప్రతి నియోజకవర్గంలో లీగల్‌ సెల్‌, మీడియా సెల్‌లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్‌పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్‌ సెల్స్‌ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్‌, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్‌గా పనిచేయాలి!

*సోషల్‌ మీడియాకు అత్యంత ప్రాధాన్యం*
ప్రతి నియోజకవర్గంలో సోషల్‌ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్‌ చేయాలి. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్‌ను తీసుకురావాలి. సోషల్‌ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్‌ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌, వైయస్సార్‌సీపీ టాక్స్‌, పార్టీ సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్‌కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్‌ కంటెంట్‌ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం!

నాయకులకు హెచ్చరిక
నియోజకవర్గాల్లో మీడియా, సోషల్‌ మీడియా, లీగల్‌ సెల్స్‌పై యాక్టివ్‌గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్‌ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్‌సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.

*ఈగోలకు తావులేదు*
స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్‌”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్‌ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాం!

*వాళ్ల పేర్లు డిజిటల్‌ బుక్‌లోకి..*
పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు!