బిక్కవోలు: మండల కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గున్నం భవనమ్మ ఇంట్లో సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై బిక్కవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను బ్యాంకులో భద్రపరిచేందుకు తీసే సమయంలో అవి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు, తలుపులు, లాక్‌లు ధ్వంసమైన గుర్తులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కుటుంబ కార్యక్రమాల నేపథ్యంలో ఇటీవల పలువురు బంధువులు ఇంటికి వచ్చి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో ఇంటికి వచ్చి వెళ్లిన వారి వివరాలను సేకరించడంతో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఫిర్యాదు మేరకు డీఎస్పీ విద్యా, సీఐ సుమంత్, బిక్కవోలు ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కొంతమంది అనుమానితుల వివరాలను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

