విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సెప్టెంబర్ 5, 2026: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
రాష్ట్రంలోని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో విద్యా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిష్ఠాత్మక ప్రతిభా పురస్కారం–2026 ను అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా విశిష్ట ప్రతిభ కనబరిచింది. 2025–26లో 43 వేల 72 మంది విద్యార్థులు ఉండగా, 2026–27లో ఈ సంఖ్య 45 వేల 626కు పెరిగి 2 వేల 554 మంది అదనంగా చేరారు. 2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది. జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలలలో 10 శాతానికి పైగా అదనపు నమోదు సాధించగా, మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాలలో 10 శాతానికి పైగా నమోదు పెరిగింది. అలాగే 2026–27లో 4 వేల 346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలలలో చేరడం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎం ఐ ఎస్, సి సి ఓ లు, సి ఆర్ పి ల సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమష్టితో జిల్లాలో విద్యాభివృద్ధి సాధ్యపడింది. మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
