22ఏ జాబితాలోని ప్రతి సర్వే నంబర్‌ను రికార్డులతో పక్కాగా క్రాస్‌చెక్ చేయాలి
ప్రైవేట్ భూములు పొరపాటున నమోదైతే 48 గంటల్లో పరిష్కరించాలి
22ఏ నుంచి తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన కారణాలు, రిమార్క్స్ నమోదు చేయాలి
ప్రభుత్వ భూములను కాపాడుతూ, నిజమైన భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి
22ఏ భూముల సమస్యపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టరు

పొలిటికల్ పవర్ సమకర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. 22ఏ జాబితాలో ఉన్న ప్రతి సర్వే నంబర్‌ను సంబంధిత రెవెన్యూ రికార్డులతో పూర్తి స్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలను నిర్ధారించాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం 22ఏ భూముల సమస్యలపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ… రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు గుర్తించబడుతున్నా యని తెలిపారు. 22ఏకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులను రెవెన్యూ అధికారులకు పంపిస్తున్నారని, వాటిపై సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించాలని సూచించారు. 22ఏ భూముల పరిశీలన, నమోదు, తొలగింపు ప్రక్రియకు జిల్లావ్యాప్తంగా ఒకే విధమైన సాధారణ ఫార్మాట్‌ను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిషేధిత భూములను ప్రధానంగా ఐదు కేటగిరీలుగా గుర్తించాలని తెలిపారు.
22ఏ నిషేధిత భూముల ఐదు కేటగిరీలు:
మొదటి కేటగిరీలో రాష్ట్ర, కేంద్ర చట్టాల పరిధిలోని నిషేధిత భూములు ఉంటాయని తెలిపారు. అసైన్‌మెంట్ భూములు, సీలింగ్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్, ఆర్ఓఎఫ్ఆర్ తదితర చట్టాల పరిధిలోని భూములు ఉంటాయని వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రకాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండవ కేటగిరీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములు, మూడవ కేటగిరీలో ఎండోమెంట్, వక్ఫ్ భూములు, నాలుగవ కేటగిరీలో సీలింగ్, అర్బన్ సీలింగ్‌కు సంబంధించిన భూములు, ఐదవ కేటగిరీలో ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఇతర భూములు ఉంటాయని తెలిపారు. గతంలో రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే కొన్ని భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తేవని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు తీసుకువచ్చి నిషేధిత కేటగిరీలకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లను నియంత్రించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజల్లో భయాందోళనలకు తావివ్వొద్దు:
కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రైవేట్ భూములు పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేరే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అలాంటి నిజమైన కేసులను గుర్తించి నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ భూములను కాజేయాలనే స్వార్థ ప్రయోజనాలు కలిగిన వ్యక్తులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం లేదా అపోహలు వ్యాప్తి చేయడం ద్వారా తమకు అనుకూలంగా భూములను 22ఏ నుంచి తొలగించుకునే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. నిజమైన కేసుగా నిర్ధారణ అయిన భూములను అవసరమైన రికార్డులను పరిశీలించి 48 గంటల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు. 22ఏ జాబితాలోని ప్రతి భూమిని సర్వే నంబర్ వారీగా క్రాస్ వెరిఫై చేయాలని తెలిపారు. ముందుగా సంబంధిత సర్వే నంబర్ పాత 22ఏ జాబితాలో ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. పాత 22ఏ జాబితాలో లేని సర్వే నంబర్ ప్రస్తుతం 22ఏలోకి ఎలా చేరిందో.. ? అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
22ఏ నుంచి తొలగింపులకు ప్రత్యేక విధానం:
ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, దానిని తొలగించేందుకు సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.22ఏ జాబితాలో భూములను చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు. తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 22ఏ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పనిచేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలోని మండల తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.