*కల్లూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్*
నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
బుధవారం కల్లూరు పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా, ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు చట్టపరంగా శిక్ష పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, మహిళలు మరియు బాలలపై జరిగే నేరాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు నాణ్యత, సిబ్బంది విధుల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పాల్గొన్నారు.

