POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 12:27 am Posted by : POLITICAL POWER

నత్తనడకన సాగుతున్న కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ

గడువు తక్కువగా ఉండటంతో ఆందోళనలో దరఖాస్తుదారులు

కొత్త పెన్షన్లకు దరఖాస్తు గడువు పెంచాలి: సిపిఐ మండల కార్యదర్శి పెద్దళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్

బ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినప్పటికీ, బ్రహ్మంగారి మఠం మండలంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అర్హులైన పేదలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి పెద్దళ్లపల్లి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గడువు చాలా తక్కువగా ఉండటంతో, ప్రతి అర్హుడూ దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు సాంకేతిక సమస్యలు, సర్వర్‌ సమస్యలు, దరఖాస్తుల నమోదులో ఆలస్యం, అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో జాప్యం వంటి కారణాలతో కూడా అర్హులైన అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు.

సచివాలయాలలో కొత్త పెన్షన్లు దరఖాస్తు చేయడంలో కొన్ని సచివాలయాలలో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో మరికొన్ని సచివాలయాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో దరఖాస్తులు నిలిచిపోతున్నాయని దరఖాస్తులు వేగవంతం చేసేలా సచివాలయ ఉద్యోగులకు దిశా నిర్దేశం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఉన్న గడువు ముగిసేలోపు అన్ని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం సాధ్యం కాదని, అందువల్ల కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం వెంటనే పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. గడువు పొడిగించిన విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. అర్హత ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం లేదా సాంకేతిక కారణాలతో ఎవరి దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్ కేవలం ప్రభుత్వ సహాయం మాత్రమే కాదని, వారి కనీస జీవన భద్రతకు ఎంతో ముఖ్యమైన ఆధారమని ప్రభాకర్ పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని గడువు పెంపుతో పాటు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ మండల నాయకులు సుజన్ పాల్గొన్నారు.