POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 1:21 pm Posted by : POLITICAL POWER

‘భార్యకు ఫ్రీ టికెట్.. భర్త నుంచి డబుల్ వసూలా?’..

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్‌రావు ఆగ్రహం

అక్టోబర్ 19: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

బతుకమ్మ, దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను భారీగా పెంచడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పండుగ సమయంలో ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి, టికెట్ ధరలను రెట్టింపు చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచకుండా, నిత్యం నడిచే రెగ్యులర్ బస్సులకే ‘స్పెషల్’ బోర్డులు తగిలించి ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. జేబీఎస్ (JBS) నుంచి కరీంనగర్‌కు రూ.230 ఉండాల్సిన టికెట్ ధరను ఏకంగా రూ.400కు పెంచారని, అలాగే మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220 ఉన్న టికెట్‌ను రూ.290 పైగా వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రూట్లలోనూ ఛార్జీలు డబుల్ చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచితం.. పురుషులపై భారం: మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి, మరోవైపు పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేయడం ఏంటని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భార్యకు ఫ్రీ టికెట్ ఇచ్చి, భర్త నుంచి రెట్టింపు వసూలు చేస్తే అది మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? అని నిలదీశారు. “ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ.. ఇదేనా మీ ప్రజాపాలన?” అంటూ ఎద్దేవా చేశారు. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఆర్టీసీ టికెట్ ధరలను ఐదు సార్లు పెంచారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ తీరు కారణంగా పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని.. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.