ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కఠిన వైఖరి – విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక తెలంగాణ స్టేట్ డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని కాలేజీ యాజమాన్యాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జీవో 7 అమలులో ఉందని పేర్కొంటూ, ఇటీవల ఆ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, జీవో 7పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరగా, దానిపై హైకోర్టు స్పష్టంగా స్పందించింది. ముందుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపినప్పటికీ, ఖచ్చితమైన టైమ్‌లైన్‌పై స్పష్టత ఇవ్వాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 24వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.