POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 1:02 pm Posted by : POLITICAL POWER

బిజెపి మతోన్మాదం యువత చైతన్యానికి ప్రతిబంధకం: శ్రీరామ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: బిజెపి హిందూ మతోన్మాదం యువత చైతన్యానికి ప్రతిబంధకమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతూరు శ్రీరామ్ అన్నారు. పానగల్ మండలం తెల్లరాల్లపల్లిలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ కాటం బాలస్వామి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పల్లెలు పట్టణాల్లో నిరుద్యోగ పేద బడుగు బలహీన వర్గాల యువతను హిందూ మతం పేరుతో, డబ్బు తాగుడు ప్రలోభాలు పెట్టి ఆకర్షిస్తోందన్నారు. నిరుద్యోగం పేదరికంపై ప్రశ్నించి, పోరాడకుండా మభ్యపెడుతుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పి అధికారంలోకి వచ్చి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ప్రతి రైతు ఖాతాలోరూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పి మోసం చేసినా కర్మ సిద్ధాంతం చెప్పి తిరగబడకుండా చేస్తోందన్నారు. సంపన్నులకు పారిశ్రామికవేత్తలకు దేశ సంపద దోచిపెడుతున్నా ప్రశ్నించకుండా యువతకు హిందూ మతం కళ్లగంత కడుతోందన్నారు. మద్యం ,మత్తు, డబ్బు ప్రలోభాలతో వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని యువత తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. ఈసీని అడ్డుపెట్టుకొని, ధనం కుమ్మరించి తాజా ఎన్నికల్లో గెలిచి బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. కార్మికులు కర్షకులు యువత ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారమే పరమావధిగా దేవుని పేరు చెప్పి అధికారం కాపాడుకుంటుందన్నారు. చికాగో నగరంలో పలువురు కార్మికుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని బిజెపి ప్రభుత్వం 12 గంటలకు పెంచిందని, లేబర్ కోడ్లతో కార్మిక చట్టాలను కాలరాచిఉందన్నారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు తదితర హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు. కష్టజీవులకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని దాని కింద ఏకమై హక్కుల కోసం పోరాడాలని కోరారు. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, వార్డు సభ్యుడు గ్రామ శాఖ కార్యదర్శి సహదేవ్, మాజీ వార్డ్ సభ్యుడు కట్టెల బాల స్వామి, ఎర్రగుంట రాముడు, పరంధాములు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.