*ఈతకు వెళ్లి ముగ్గురు స్నేహితుల మృతి… సిద్దిపేట జిల్లాలో విషాదం*
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
హైదరాబాద్: మే07
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో గురువారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా గడపాలని వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డి (27) స్నేహితులు కలిసి తూప్రాన్ ప్రాంతంలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో వర్గల్ మండలంలోని నాచారం సమీపంలో ఉన్న హల్దీ వాగు వద్ద కొద్దిసేపు సేదతీరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురూ వాగులోకి దిగగా, నీటి లోతును అంచనా వేయలేక ప్రవాహంలో చిక్కుకున్నారు.కొంతసేపటి తర్వాత వారు కనిపించకపోవడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వేసవి కాలంలో వాగులు, చెరువులు, కాలువల్లో ఈతకు దిగేటప్పుడు యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నీటి లోతు, ప్రవాహం గురించి పూర్తి అవగాహన లేకుండా నీటిలోకి దిగడం ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు.