*రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారులు*
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 07:
భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని చెట్లను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత బాధితుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బాధితుడి నుంచి మొదటి విడతగా రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సుజాతతో పాటు చర్ల అటవీ శాఖ ఇన్‌చార్జ్ అధికారి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో భద్రాచలం అటవీ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
*స్టేట్ బ్యూరో, నిజం న్యూస్*