POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 12:30 pm Posted by : POLITICAL POWER

కరీంనగర్ రణరంగం..!*

 

పాలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్

– నేడే బంద్‌తో రాజకీయ తుఫాన్

– కార్యాలయాలపై దాడులు.. హౌస్ అరెస్టులు.. జిల్లాలో హై టెన్షన్

– బీఆర్ఎస్ బంద్ పిలుపుతో ఒక్కసారిగా హీట్ ఎక్కిన కరీంనగర్

– 🚔 అప్రమత్తమైన పోలీసులు.. నగరమంతా భారీ బందోబస్తు

కరీంనగర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లా అంతా ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజాము నుంచే ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 

దాడి ఘటన తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఒకవైపు దాడులను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపడుతుండగా, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. దీంతో కరీంనగర్ రాజకీయ కేంద్రమై మారింది.

 

బంద్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. “ఇది కేవలం పార్టీ కార్యాలయంపై దాడి కాదు… ప్రజాస్వామ్యంపై దాడి” అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరోవైపు పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ రవి శంకర్. ను హౌస్ అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

 

కరీంనగర్‌లో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలపై కూడా బంద్ ప్రభావం కనిపిస్తోంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

ఇప్పటికే మాజీ మంత్రి కేటీ రామారావు కరీంనగర్ పర్యటనకు సిద్ధమవుతుండగా, జిల్లాలో రాజకీయ రగడ మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే కరీంనగర్‌లో వరుస రాజకీయ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.