POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 6:45 pm Posted by : POLITICAL POWER

*ప్రేమ వ్యవహారం విషాదం.. పెద్దపల్లిలో దళిత యువకుడి దారుణ హత్య కలకలం*

 

పెద్దపల్లి జిల్లా, మే 10:

పొలిటికల్ పవర్ తెలుగు సమగ్ర దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడి దారుణ హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదలగండి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం కుళ్లిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది.

 

వంశీ ఈ నెల ఏప్రిల్ 30 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు నాలుగు రోజుల తర్వాత గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

దర్యాప్తులో భాగంగా వంశీ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ యువతి మరియు ఆమె భర్తను విచారణకు తీసుకురాగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

 

*ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా..?*

 

పోలీసుల సమాచారం ప్రకారం, వంశీ తన గ్రామానికి చెందిన ఓ యువతితో గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. అనంతరం ఆ యువతి మరో వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది.

 

అయితే ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా యువతి తిరిగి గ్రామానికి రావడంతో వంశీతో మళ్లీ ఫోన్ సంభాషణలు ప్రారంభమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి భర్త, ఆమె ద్వారానే వంశీని హైదరాబాద్‌కు పిలిపించి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం.

 

హత్య అనంతరం మృతదేహాన్ని మంథని సమీపంలోని గాడిదలగండి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగి దాదాపు పది రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైంది.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.