అధికార పార్టీ నాయకుల అండతో రైతులను మోసం చేస్తున్న బలిజపల్లి వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో పెద్దమందడి సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఉపయోగిస్తున్న తూకం మిషన్‌లో లోపం ఉండటంతో ప్రతి బస్తాకు 4 నుండి 5 కిలోల వరకు అదనంగా తూకం నమోదవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రైతులు, సమీప గ్రామమైన అంకూర్‌లో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలోని తూకం మిషన్‌తో పోల్చి పరిశీలించగా దాదాపు 4 కిలోల వరకు తేడా వస్తోందని గుర్తించినట్లు తెలిపారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని రైతులు వాపోయారు. ఇప్పటికే కేంద్ర ప్రారంభోత్సవ సమయంలోనే గ్రామ సర్పంచ్ గట్టు నాగేష్ ఈ సమస్యను మండల స్పెషల్ ఆఫీసర్ మరియు సీఈవో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 2000 బస్తాలకు పైగా తూకం నిర్వహించగా, అందులో 1500 బస్తాలు ఇప్పటికే మిల్లులకు తరలించారని నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని, అనుభవం లేని వ్యక్తులతో కేంద్రాన్ని నిర్వహిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి తూకం మిషన్‌లను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.