*బేటీ బచావో కాదు… బేటా బచావోగా మారింది బీజేపీ నినాదం*

– మైనర్ బాలికపై హత్యాచారం చేసిన బండి కొడుకు ఎక్కడ ?
సాయి భగీరథ్ ను అరెస్ట్ ఎందుకు చేయట్లే ?
బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి – బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొంపల్లి నిర్మల

పిర్జాదిగూడ: 11 మే (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొంపల్లి నిర్మల మాట్లాడుతూ… “బేటీ బచావో” అంటూ దేశవ్యాప్తంగా నినాదాలు ఇచ్చే బీజేపీ, ఇప్పుడు “బేటా బచావో” విధానాన్ని అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, నిందితుడు సాయి భగీరథ్‌ను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందన్నారు. చట్టం అందరికీ సమానమైతే అధికార పార్టీల నేతల కుటుంబాలకు మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ… దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బండి సంజయ్, ఇప్పుడు తన కుమారుడిని కాపాడేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. “బేటీ బచావో” నినాదాన్ని “బేటా బచావో”గా మార్చినట్టుగా పరిస్థితి కనిపిస్తోందన్నారు. బాధితురాలి 164 సి.ఆర్ పీసీ స్టేట్మెంట్ ఇప్పటివరకు నమోదు చేయకపోవడం కూడా చట్టపరమైన నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ స్థాయి మహిళా అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్) ఏర్పాటు చేసి, హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మాజీ కార్పొరేటర్ కొల్తూరి మహేష్ మాట్లాడుతూ… బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు గంటల తరబడి స్వీకరించకపోవడం, ఫిర్యాదును మార్చమని ఒత్తిడి తేవడం, కేసు వెనుక పెద్దలు ఉన్నారని చెప్పడం వంటి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. న్యాయం కోసం బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి మాట్లాడుతూ… ప్రధానమంత్రి సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే ఫిర్యాదు స్వీకరించడం దురదృష్టకరమన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక సమ్మతి చెల్లదని, అయినప్పటికీ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితురాలిపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య మాట్లాడుతూ… ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితుడికి సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, వారి కాల్ డేటాను విచారించాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని నిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ కేసును మీడియా దృష్టికి రాకుండా దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. “హనీ ట్రాప్” పేరుతో అసలు అంశాన్ని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మహిళల భద్రతపై మాట్లాడే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ ప్రయోజనాల కోసం కేసును బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, నాయకులు ఆకుల మధుకర్, కందుకూరి ఆంజనేయులు, గడీల జగన్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, పాశం నరేందర్ రెడ్డి, పుల్ల శ్రీనివాస్, బుల్లెట్ శంకర్, నర్సిరెడ్డి, కళ్యాణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.