POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:00 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం బచ్చోడు గ్రామపంచాయతీలోఅవినీతి అక్రమాలదందా 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

బచ్చోడు పంచాయతీలో అవినీతి అక్రమాల దందా!?

‘బిల్లులు చూపించండి’ అంటే బెదిరింపులు… ప్రతిపక్షంపై వివక్ష!

లక్షల నిధులు మాయం… సమావేశాలకు మొండిచేయి చూపుతున్న సర్పంచ్!?

బచ్చోడు గ్రామ పంచాయతీలో అవినీతి తాండవం చేస్తోందని, అధికార అహంకారంతో సర్పంచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘నీ ఇష్టమే నా ఇష్టం’ అన్నట్టు కార్యదర్శి సర్పంచ్‌కు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ వార్డు సభ్యులు మండిపడ్డారు. మంగళవారం జరిగిన వార్డు సభ్యుల సమావేశంలో పంచాయతీ అవినీతి బాగోతం బట్టబయలైందని సభ్యులు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని, చేసిన పనులకు సంబంధించిన బిల్లులు, ఖర్చుల లెక్కలు చూపించాలని నిలదీసినా సర్పంచ్, కార్యదర్శి నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వార్డు సభ్యుల ఆరోపణలు:

“పంచాయతీలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. గ్రామాభివృద్ధి కోసం వచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి? చేసిన పనులేవో, అయిన ఖర్చెంతో బిల్లులు చూపించమంటే దాటవేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో నిధులు మాయమయ్యాయి. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం, అహంకారపూరిత పాలన” అని బీఆర్ఎస్ వార్డు సభ్యులు సహా పలువురు సభ్యులు ముక్తకంఠంతో ఆరోపించారు.

సమావేశాల్లోనూ పక్షపాతం ఆరోపణ:

ఇదిలా ఉండగా, ప్రతి సమావేశానికి సర్పంచ్, కార్యదర్శి ఆలస్యంగా రావడం ఆనవాయితీగా మారిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. “ఉదయం 9 గంటలకు సమావేశం అని వార్డు సభ్యుల హాజరు రిజిస్టర్‌లో సంతకాలు తీసుకొని, 10 దాటినా సమావేశానికి హాజరు కావడం లేదు. ఇది వారి నిర్లక్ష్యానికి, నిరంకుశ వైఖరికి నిదర్శనం. దీనిపై ప్రశ్నిస్తే కార్యదర్శి ప్రతిసారీ సర్పంచ్‌ను వెనకేసుకొస్తున్నారు” అని వారు విమర్శించారు. అదే సమయంలో ప్రతిపక్ష వార్డు సభ్యులు ఒక్క నిమిషం ఆలస్యమైనా “సమావేశం ముగిసింది” అని చెప్పి బయటకు పంపిస్తున్నారని, ఇది పచ్చి పక్షపాతమని సభ్యులు మండిపడుతున్నారు. “లెక్కలు అడిగినందుకు సమావేశం నుంచి వెళ్లిపొమ్మని హుకుం జారీ చేస్తున్నారు. పారదర్శకత లేకుండా, గ్రామ సభ తీర్మానాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.