ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్మికులకు భారీ శుభవార్త

తెలంగాణలో కనీస వేతనాల సవరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
జూన్ 1 నుంచి కొత్త కనీస వేతనాలు అమలు
1.11 కోట్లకు పైగా కార్మికులకు లబ్ధి – అత్యధికంగా 34.95 శాతం వరకు వేతనాల పెంపు
హైదరాబాద్, మే 21:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ ఉపాధి రంగాలకు కొత్త వేతన నిర్మాణాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనీస వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కనీస వేతనాల చట్టం–1948 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత కల్పించేందుకు వేతనాలను నిర్ణయించే అధికారం కలిగి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ, 2006–2012 మధ్య జరిగిన సవరణ తర్వాత మరో సమగ్ర సవరణ చేపట్టలేదు.
ఈ విషయాన్ని గురువారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కటించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఉదయం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తక్కువ వేతనాలు పొందుతున్న కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని చేర్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. గత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కనీస వేతనాల సవరణ జరగలేదని పేర్కొన్నారు.
కార్మికులకు సరైన వేతనాలు అందించినప్పుడే వారి ఉత్పాదకత పెరుగుతుందని, కార్మికుల సంతృప్తి ఉన్నప్పుడే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలిపారు. కనీస వేతనాల కమిటీ నిర్వహించిన చర్చల్లో పరిశ్రమల ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వేతనాల పెంపు అవసరమని వారు అంగీకరించినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మల్లు బట్టు విక్రమార్క,దుద్దిళ్ శ్రీధర్ బాబు మంత్రి వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ కమిటీకి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.
ఈ కొత్త కనీస వేతనాల నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 11 లక్షల మంది కార్మికులపై ప్రభావం చూపనుంది. ఇందులో సుమారు 75 లక్షల మంది అసంఘటిత కార్మికులు, 21 లక్షల మంది మధ్యస్థ నైపుణ్య కార్మికులు, 15.64 లక్షల మంది నైపుణ్య కార్మికులు ఉన్నారు.
మొత్తంగా ఈ నిర్ణయం రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ఒక కీలక ముందడుగు కానుందని ప్రభుత్వం పేర్కొంది.