ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను: కేసీఆర్

ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను: కేసీఆర్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: హైదరాబాద్, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను” అంటూ ఆయన భావోద్వేగంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనతో కలిసి నడిచిన రోజుల జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడేందుకు పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణనే శ్వాసగా భావించి, నీతి, నిజాయితీలతో ప్రజాజీవనం సాగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు. పోరాటాల ఖిల్లాగా పేరొందిన నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడిగా ఆయనను అభివర్ణించారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిన పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యసాహసాలు, సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేసీఆర్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆయన భార్యా పిల్లలకు పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. చివరగా, పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!