ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Previous article
Next article
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలను, గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించింది. కానీ, నేటి సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఆశయాలకు, ఆచరణకు మధ్య అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా కుటుంబ వ్యవస్థలు, మానవ సంబంధాలు ముక్కలవుతుంటే, మరోవైపు దిగువ మధ్యతరగతి ప్రజలు వ్యవస్థల నుంచి కనీస హక్కులను సైతం పొందలేక అలమటిస్తున్నారు. సంపన్న వర్గాల పిల్లలు విదేశీ విద్యను ఒక విలాసంగా మార్చుకుంటున్న తరుణంలో, పూట గడవక కనీసం సర్కారు బడి మొహం చూడలేక బాల్యాన్ని బలిపెడుతున్న నిరుపేద పిల్లల దుస్థితి మన ప్రజాస్వామ్యానికే ఒక సవాలుగా నిలుస్తోంది.ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నారు, సరికొత్త నినాదాలు పుట్టుకొస్తున్నాయి. కానీ, సామాన్యుడి ప్రాథమిక జీవన విధానంలో మార్పు రావడం లేదు. సంక్షేమ పథకాలను కేవలం ఓట్ల పంట పండించుకునే తాత్కాలిక సాధనాలుగా వాడుకుంటున్నారే తప్ప, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం వంటి హక్కులను అందించడంలో పాలకపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రజల పన్నులతో లబ్ధి పొందుతున్న నాయకులు, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న కొందరు నాయకుల తీరు వల్ల, దిగువ తరగతి ప్రజానీకం తమ కనీస హక్కుల కోసం కూడా పోరాడాల్సిన దైన్యం ఏర్పడింది.ఈ వ్యవస్థాగత లోపాలను ఇలాగే వదిలేస్తే సమాజంలో అసమానతలు మరింత తీవ్రరూపం దాలుస్తాయి. అందుకే, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి పౌరుడు చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యయుతమైన మార్గాల్లో ఈ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఆసన్నమైంది. పాలకులు తమ బాధ్యతను గుర్తుచేసేలా, సామాన్యుడి గొంతుకను చట్టసభలకు వినిపించేలా మనమంతా నడుం బిగించాల్సి ఉంది కుర్రే రాజేంద్ర రెడ్డి, సామాజిక రాజకీయ విశ్లేషకులు. తాడేపల్లి మరియు జాతీయ కార్యదర్శి కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!