POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 10:03 pm Posted by : POLITICAL POWER

గడ్డి మందు సేవించి యువకుడి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. బిక్కవోలు పోలీసుల కేసు నమోదు

బిక్కవోలు, ఆగస్టు 13: బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో 37 ఏళ్ల వ్యక్తి గడ్డి మందు సేవించి మృతి చెందిన ఘటనపై బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు BNSS సెక్షన్ 194 కింద Cr.No.133/2026గా కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊలపల్లి గ్రామంలోని బొమ్మలపేటకు చెందిన అనసూరి చంద్ర (37) మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. చంద్రకు లక్ష్మితో వివాహం కాగా, వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా కొంతకాలంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో చంద్ర అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే వివాహిత మహిళతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. చంద్రకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో, మద్యం సేవించవద్దని ధనలక్ష్మి పలుమార్లు హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడప్పుడు చంద్ర తన తల్లి ఇంటికి కూడా వస్తుండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ నెల 11వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మద్యం సేవించవద్దని ధనలక్ష్మి హెచ్చరించడంతో చంద్రతో ఆమెకు వివాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం చంద్ర గడ్డి మందు సేవించినట్లు పోలీసులు తెలిపారు.

విషయం తెలుసుకున్న ధనలక్ష్మి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి చంద్రను అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ 12/13వ తేదీ అర్ధరాత్రి సుమారు 2.38 గంటలకు చంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

చంద్ర మృతి విషయం తెలుసుకున్న అతని తల్లి అనసూరి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి నుంచి అందిన మరణ సమాచారం, ఫిర్యాదుదారురాలి నివేదిక ఆధారంగా బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ విభేదాలు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.