POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 4:11 pm Posted by : POLITICAL POWER

ఆదివాసి ఎమ్మెల్యేలు ఇకనైనా నోరు విప్పండి: పాయం

భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుకు కొనసాగుతున్న పాదయాత్ర

పొలిటికల్ పవర్, దుమ్ముగూడెం, ఆగస్టు 19:

భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. నడికుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రేగుబల్లి, సీతారాంపురం, నర్సాపురం, కన్నాయిగూడెం, సీతంపేట, చింతలగూడెం మీదుగా చెన్నంపేట వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇకనైనా స్పందించాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలు, న్యాయ కళాశాల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రను చూసైనా ఆదివాసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో న్యాయ కళాశాల ఏర్పాటుపై గళం విప్పి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 20న పాదయాత్ర భద్రాచలం చేరుకుని అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు కొనసాగుతుందని పాయం సత్యనారాయణ తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని గిరిజనులు, పేదలు, విద్యార్థులకు న్యాయ విద్య అందుబాటులోకి వస్తుందని, న్యాయ రంగంలో స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన న్యాయ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.

  1. ఈ పాదయాత్రలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య, జిల్లా అధ్యక్షులు భీరబోయిన శేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొంది లీలా ప్రసాద్, పాయం సన్యాసి, సున్నం సుబ్బయ్య, కారం సుధ, కారం సాయమ్మ, పోడియం రామ్ అక్క తదితరులు పాల్గొన్నారు.