ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి: గోండ్వానా సంక్షేమ పరిషత్
పొలిటికల్ పవర్, భద్రాచలం, ఆగస్టు 20: ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గిరిజన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుంది. ఈ నెల 17న చర్ల మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర దుమ్ముగూడెం మీదుగా కొనసాగి భద్రాచలం ఐటీడీఏ వరకు చేరుకుంది. అనంతరం ఐటీడీఏ పీవోకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన చట్టాలతో కూడిన ప్రత్యేక సిలబస్‌ను గిరిజన సంక్షేమ శాఖ రూపొందించాలని కోరారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఐదవ షెడ్యూల్, గిరిజనుల భూమి హక్కులు, ఏజెన్సీ చట్టాలు, గిరిజన హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజన విద్య ద్వారానే భవిష్యత్ తరాలకు గిరిజన చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించి గిరిజనుల మనుగడను కాపాడగలమని ఆయన అన్నారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూమి హక్కులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
పాదయాత్రకు వివిధ ప్రజా, ఆదివాసీ సంఘాలు, నాయకులు సంఘీభావం తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, మలిదశలో 100 రోజుల దండయాత్ర కార్యక్రమాన్ని చేపడతామని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా మహిళా సంఘం కార్యదర్శి కల్పన, పీడీఎస్ జిల్లా కార్యదర్శి మునిగల శివప్రశాంత్, జీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, ఏఎన్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముర్రం వీరభద్రం, ఆదివాసీ నాయకులు కుంజా శ్రీనివాసరావు, కొర్ష నరసింహమూర్తి, వాసం నాగరాజు, ఆదివాసీ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఇర్ప రాజు, అపర్ణ, జీఎస్‌పీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భీరబోయిన శేఖర్, భీరబోయిన అరుణ, సున్నం సుబ్బయ్య, పాయం సన్యాసి, కారం సాయమ్మ, కారం నాగసుధ తదితరులు పాల్గొన్నారు.