POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:17 pm Posted by : POLITICAL POWER

బాధితులపైనే దాడులు దారుణం.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: దళిత నాయకుల డిమాండ్

 

అనపర్తి జూలై 16: రామవరం గ్రామంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై జరిగిన దాడుల అనంతరం బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు, దళితులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్‌తో పాటు పలువురు దళిత నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మీడియా సమావేశంలో లింగం శివప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దాడులు, హింసాత్మక ఘటనలు, లాకప్ డెత్‌లు పెరిగాయని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వారిపై కూడా దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, దళితులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

దళితుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో దళితులు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో నందిక సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయని, నిందితులను అరెస్ట్ చేసే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఇతర దళిత నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ అక్రమాలను వీడియోలో చిత్రీకరించాడనే కక్షతో దళిత మీడియా ప్రతినిధి నొక్కు శ్రీనుపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఘటన జరిగినప్పటికీ, ఆధారాలు ఉన్నా నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం విచారకరమన్నారు. చట్టాన్ని నిస్పక్షపాతంగా అమలు చేసి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులు, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.