POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:26 pm Posted by : POLITICAL POWER

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

 

బిక్కవోలులో వైఎస్సార్‌సీపీ రీలే నిరాహార దీక్ష ముగింపు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

బిక్కవోలు: డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.

డీఎస్సీ అక్రమాలకు నిరసనగా బిక్కవోలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్ష శుక్రవారం ముగిసింది. దీక్షలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వహించినది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన “దగా డీఎస్సీ” అని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో తమకు అనుకూలమైన వారికి అవకాశాలు కల్పించేందుకు నిబంధనలు, జీవోలను మార్చారని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను పూర్తిగా పారదర్శకంగా భర్తీ చేశారని, అప్పట్లో ఎలాంటి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేకుండా అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని, ఎన్నికల హామీల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు,యువత పాల్గొన్నారు