బిక్కవోలు, ఆగస్టు 18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు, ఊలపల్లి గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌సీ ఏడీఏ ఎస్. జయరామలక్ష్మి, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ ఏవో కే. సూర్యరమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏడీఏ ఎస్. జయరామలక్ష్మి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట సంరక్షణ చర్యలు పాటించాలని, వ్యవసాయ శాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
టెక్నికల్ ఏవో కే. సూర్యరమేష్ మాట్లాడుతూ.. ఎలుకల వల్ల పంటలకు కలిగే నష్టాన్ని రైతులకు వివరించారు. ఎలుకల జీవన విధానం, పొలాల్లో వాటి ఉనికిని గుర్తించే విధానం, బొరియలను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బ్రోమాడయోలోన్ 2 శాతం మందు మిశ్రమాన్ని తయారు చేసి బొరియల వద్ద వినియోగించే విధానాన్ని రైతులకు వివరించారు.
బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి జి. వాణి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినందున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే ఆగస్టు 19న బిక్కవోలు మండలంలోని అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎలుకల మందు మిశ్రమాన్ని రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు మందు మిశ్రమాన్ని తీసుకుని సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి పంటలను కాపాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఈవోలు కె. శ్రీనివాసు, కె.ఎం. భాస్కర్‌రెడ్డి, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.
