POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:12 pm Posted by : POLITICAL POWER

**ఏజెన్సీలో ఇకపై గిరిజనేతరుల అక్రమ పెత్తనం సాగనివ్వ. దేవీపట్నం తహశీల్దార్, ఎంపీడీఓలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఫిర్యాదు, తీవ్ర హెచ్చరిక*

దేవీపట్నం (ఇందుకూరు), జూలై 18: ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. పొలిటికల్ పవర్
“ఆదివాసీల మంచితనమే వారికి శాపంగా మారి ఏజెన్సీలో గిరిజనేతరుల అక్రమ ఆక్రమణలకు దారితీస్తోంది. ఇకపై ఆదివాసీ సమాజం మౌనంగా ఉండదు; తమ రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఉద్యమగళం విప్పే సమయం ఆసన్నమైంది” అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఐదో షెడ్యూల్డ్ ఏరియా రక్షణ చట్టాలను, ఎల్‌టీఆర్ 1/70 (ఎల్ టిఆర్ 1/70) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ దేవీపట్నం మండలంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా నాన్-ట్రైబల్స్ అక్రమంగా నిర్మించిన వ్యాపార సముదాయాలు, హోటళ్లు, రిసార్టులు మరియు శాశ్వత కట్టడాలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుల బృందం దేవీపట్నం తహశీల్దార్ మరియు ఎంపీడీఓలను కలిసి అధికారిక లీగల్ రిప్రజెంటేషన్ మరియు ఆర్టీఐ ( ఆర్టిఐ) దరఖాస్తులను సమర్పించింది.
ఈ సందర్భంగా కుంజా శ్రీను మాట్లాడుతూ.. ఏజెన్సీ ట్రాక్ట్స్ చట్టం-1917, ఎల్‌టీఆర్ 1/59 మరియు సవరణ చట్టం 1/70 నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరులు భూములను కలిగి ఉండటం కానీ, ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడం కానీ ముమ్మాటికీ చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఏజెన్సీ భూమి తమ వద్ద చట్టబద్ధంగానే ఉందని నిరూపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ( బర్ధన్ ఆఫ్ ప్రూఫ్) చట్ట ప్రకారం గిరిజనేతరులదేనని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ దేవీపట్నం మండల కేంద్రంలోని ఇందుకూరు, ఇందుకూరుపేట, శరభవరం, పాజులబాద్ (పెద్ద భీమ్‌పల్లి) గ్రామాల్లోని ప్రధాన రహదారి మార్జిన్లు, గ్రామ కంఠాలు మరియు ప్రభుత్వ స్థలాలను దాదాపు 99 శాతం మంది గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకుని వాణిజ్య వ్యాపారాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక గిరిజన హక్కులను కాలరాస్తూ, రోడ్డు భద్రతను పణంగా పెట్టి వెలిసిన ఇలాంటి అక్రమ కట్టడాలకు స్థానిక పంచాయతీలు ఏ అధికారంతో భవన అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు మరియు ఎన్ఓసీలు (ఎన్ ఓ సి) ఇచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“ఇకపై ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్-ట్రైబల్స్ ఆగడాలు సాగవు. చట్టవిరుద్ధంగా ఇక్కడ తిష్టవేసిన ప్రతి ఒక్క నాన్-ట్రైబల్‌ను మైదాన ప్రాంతాలకు పంపించి తీరాలి. 1905 ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఈ ఆక్రమణలన్నింటిపై తక్షణమే రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి” అని శ్రీను డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి 15 రోజుల్లోగా అక్రమ కట్టడాల తొలగింపునకు చర్యలు చేపట్టకపోతే, క్షేత్రస్థాయిలో ఆదివాసీలను ఏకం చేసి ఏజెన్సీ వ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే గౌరవ హైకోర్టును ఆశ్రయించి చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను కూడా బోనులో నిలబెడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీఠప్రసాద్, స్థానిక ముఖ్య నేతలు యాలగడ్డ నాగేశ్వరరావు, కుంజం పండు దొర, గౌరీ శంకర్ మరియు పెద్ద సంఖ్యలో ఆదివాసీ యువకులు పాల్గొన్నారు.
ఇట్లు
కుంజ శ్రీను