POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 11:04 pm Posted by : POLITICAL POWER

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

అనపర్తి, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ–2025 నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా అనపర్తిలో గురువారం రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వహించినది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన “దగా డీఎస్సీ” అని విమర్శించారు.

ప్రభుత్వానికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించేలా నిబంధనలు, జీవోలను సైతం మార్చారని ఆయన ఆరోపించారు. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సుమారు 1.50 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని, ఆ నియామకాలపై ఎలాంటి విమర్శలు రాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భర్తీ చేసిన 16,347 డీఎస్సీ పోస్టుల్లో కూడా అధికార పక్షానికి అనుకూలమైన వారికే ప్రాధాన్యం ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

ఎన్నికల హామీల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, పరీక్షలు రాయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోయినా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోయినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.