POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 11:33 am Posted by : POLITICAL POWER

ప్రమాదకరంగా మారిన పందలపాక వంతెన

 

పందలపాక గ్రామం వంతెనపై ప్రమాదకర పరిస్థితి
రైలింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఆర్&బీ అధికారులు – కాలువలోకి దాదాపు పడిపోయిన లారీ

బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలో మసీదు సమీపంలో ఉన్న వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ రైలింగ్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ వంతెనపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందలపాక,ఊలపల్లి మీదుగా  మామిడాడ గ్రామానికి వేళ్ళే వాహనాలు, స్కూలు బస్సులు ఇదే దారి గుండా వేళ్ళడం వలన నిత్యం ప్రమాదాన్ని తప్పించుకుని వేళ్ళవలసి వస్తుందని స్దానికులు,తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వంతెనకు రక్షణ రైలింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పలుమార్లు ఆర్&బీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఒక లారీ వంతెనపై అదుపుతప్పి కాలువలోకి దాదాపు పడిపోయే ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో అధికారులు ఇప్పటికైనా స్పందించి వంతెనకు బలమైన రక్షణ రైలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రాణ నష్టం సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.