POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:54 pm Posted by : POLITICAL POWER

నేటి నుంచే ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

 

 

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

 (బిక్కవోలు): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని శుక్రవారం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామంలో ప్రారంభించినట్లు మండల వ్యవసాయ అధికారి జి. వాణి తెలిపారు.

కార్యక్రమానికి అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకులు డి.వి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరగడం వల్ల ఏర్పడే అసహజ వాతావరణ పరిస్థితులను ఎల్‌నినోగా పిలుస్తారని వివరించారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలు లేదా తక్కువ కాలపరిమితి గల పంట రకాలను ఎంచుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగిస్తూ సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డీఆర్‌సీ సహాయ వ్యవసాయ సంచాలకులు కె. జయరామలక్ష్మి మాట్లాడుతూ, ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో ప్రత్యేక కమిటీలు ప్రతి రైతును, ప్రతి వ్యవసాయ భూకమతాన్ని సందర్శించి పంటల ప్రస్తుత పరిస్థితి, నీటి కొరత ప్రభావం, చీడపీడల ఉధృతి, ఉద్యాన పంటల స్థితి, బీడు భూములు తదితర అంశాలను పరిశీలించి నివేదికలు రూపొందిస్తాయని తెలిపారు. ఈ కమిటీల్లో గ్రామ వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకులు, నీటి సంఘం లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యుడు, ఇద్దరు అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉంటారని వివరించారు.

మండల వ్యవసాయ అధికారి జి. వాణి మాట్లాడుతూ ప్రతి భూకమతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించి అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలను రైతులకు వెంటనే అందజేస్తారని తెలిపారు.

అనంతరం అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించి డ్రోన్ స్ప్రేయింగ్ విధానాన్ని పరిశీలించారు. డ్రోన్ ద్వారా పంటలపై మందుల పిచికారీ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ కె. శ్రీనివాస్, గ్రామ ఉద్యాన సహాయకుడు శరత్ తేజ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.