POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:49 pm Posted by : POLITICAL POWER

శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రుల ఎనిమిదవ రోజు సింహా రూఢా అవతారంలో శ్రీ వారాహిమాత

 

శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు అమ్మవారు సింహ రూఢా విజయ వారాహి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అతి తక్కువ కాలంలోనే విశేష ఖ్యాతి పొందిన ఈ ఆలయానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. గుప్త నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కో ప్రత్యేక నవరాత్రి అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తోంది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి, కాశీ తరహాలో భూగర్భ వారాహిమాత దర్శనం లభించడం తమ అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి తమ కోరికలను వినిపించుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో వెలసిన శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయ విశిష్టత ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తుండటం విశేషం.

గుప్త నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా శనివారం అమ్మవారికి వైదిక విధానంలో చండీ హోమం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.