POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 1:24 pm Posted by : POLITICAL POWER

ఆదివాసీ నాయకులపై కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలను ఖండించిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు దారబోయిన రమేష్

పొలిటికల్ పవర్, జూలై 15:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల ఆదివాసీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను తుడుందెబ్బ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు దారబోయిన రమేష్ తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, పీసా చట్టం, 1/70 భూ బదిలీ నియంత్రణ వంటి చట్టాల పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న ఆదివాసీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదని అన్నారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కులను కాలరాస్తూ జరుగుతున్న అక్రమాలు, అవినీతి, సహజ వనరుల దోపిడీపై మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మీ చేతకానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన నాయకుడు, సమస్యలను లేవనెత్తిన వారిపైనే ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ ఆదివాసీ ప్రజల హక్కులపై మీ పెత్తనం ఏమిటి? మా భూములు, మా అడవులు, మా సహజ వనరులు, మా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రశ్నిస్తే ధైర్యంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం, మా వేలితోనే మా కంటినే పొడిచే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు.
ఆదివాసీ సమాజం ఎంతో సహనంతో వ్యవహరిస్తోందని, అయితే ఆ సహనాన్ని బలహీనతగా భావించవద్దని సూచించారు. ఆదివాసీల హక్కులను అణగదొక్కే ప్రయత్నాలు, అవమానకర వ్యాఖ్యలు, ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు ఇకపై సహించబోమన్నారు.ఇకనైనా మీ తీరు మార్చుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని సూచిస్తున్నాం. లేనిపక్షంలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ప్రజానీకం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మీకు తగిన సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.ప్రజా సమస్యలపై చర్చకు మేము ఎప్పుడూ సిద్ధమే. కానీ ఆదివాసీ సమాజాన్ని అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే తుడుందెబ్బ ఉద్యమం మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.