పొలిటికల్ పవర్ న్యూస్
అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 03:
మహిళలపై జరిగే నేరాల నివారణతో పాటు వారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిక్కవోలు పోలీసులు సోమవారం కొమరిపాలెం, తోస్సిపూడి గ్రామాల్లో విస్తృత మైక్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు ఎదురైనా లేదా ఇబ్బందులు కలిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా అత్యవసర సేవల నంబర్ 112ను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
మహిళల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్న పోలీసులు, సమాజంలో మహిళల పట్ల గౌరవభావంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ మహిళల భద్రతకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ అవగాహన కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో మహిళల భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.