POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 10:18 pm Posted by : POLITICAL POWER

బిక్కవోలులో వైయస్‌ఆర్‌సీపీ భారీ నిరసన

oplus_18

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్

• జగన్‌ పిలుపుతో బిక్కవోలులో నిరసన హోరు.. ఆంక్షల నడుమ కదిలిన విద్యార్థి, యువజన విభాగాలు

• పోలీసుల ఆంక్షలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు

• డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి

బిక్కవోలు: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు బిక్కవోలు గ్రామంలో డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్రంగా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.

అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణ కోసం న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో పార్టీ శ్రేణులు మరింత ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.