బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించిన బీజేపీ బృందం.
సీతారామ ప్రాజెక్టు మట్టి తరలింపు,

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ నిర్మాణంలో జరుగుతున్న భారీ అవినీతి, సీతారామ ప్రాజెక్టు మట్టి అక్రమ రవాణాపై భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సాలి శివకృష్ణ నేతృత్వంలో బీజేపీ బృందం ఈరోజు బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించింది.
జాతీయ స్థాయికి చేరిన అక్రమాల వ్యవహారం
ఈ భారీ అవినీతిపై బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పటికే స్పందించి, పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని నిలువరిస్తుందనే నమ్మకాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ని వీరంరాజు మాట్లాడుతూ… సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టిని ఏ అనుమతులతో, ఎవరికి లాభం చేకూరేలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై లెక్కలను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. రైతులకు పరిహారం పేరుతో ఎకరాకు రూ.1.30 లక్షలు చొప్పున ఇచ్చి, మొత్తం రూ.3 కోట్ల లోపు మాత్రమే ఖర్చు చేసిన ప్రభుత్వం, మిగిలిన రూ.100 కోట్లకు పైగా నిధులను ఎక్కడ వినియోగించింది? ఏ ఖాతాలకు మళ్లించిందని ప్రశ్నించారు. స్థానిక యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సింది పోయి, వారి పొట్టకొట్టి ఆంధ్ర కంపెనీలకు భూములు అప్పగించడం వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ‘దీపక్ నెక్స్ట్ జెన్’ వంటి సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయించడం వెనుక ఎవరి వాటాలు ఎంత ఉన్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రజాక్షేత్రంలో దోషులను ఎండగడతాం
బీజేపీ నాయకులు మాట్లాడుతూ… “ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని, స్థానికులను విస్మరిస్తే ఊరుకునేది లేదు. దోషులు ఎంతటి వారైనా సరే, రాబోయే రోజుల్లో వారిని ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ముఖ్యంగా టీజీఐఐసీ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సాలి శివకృష్ణ, మాజీ జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్‌రావు, జిల్లా సీనియర్ నాయకుడు చీకటి వసంతరావు, మండల ఉపాధ్యక్షుడు ఎస్కే సుభాని, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.


