ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్యువతరం పోరాటం: అహంకారంపై ప్రజాస్వామ్య విజయం..

యువతరం పోరాటం: అహంకారంపై ప్రజాస్వామ్య విజయం..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ విశ్లేషణాత్మక కథనం ఘటన చిన్నదే కావచ్చు. ప్రపంచం నలుమూలలా ప్రభావం చూపే ప్రభుత్వ పతనాలో, విప్లవాలో కాకపోవచ్చు. కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామానే కావచ్చు. ఇతని కంటే ఘనుడు మరో ఆచంట మల్లన్న ఆ పదవిలోకి రావచ్చు. పుష్కర కాలంగా వెన్నాడుతున్న ‘భయం’ చెర వీడి ఈసడించుకున్న బొద్దింక పేరునే తమ దీక్షాదక్షతలకు పతాకంగా ధరించి, జంతర్ మంతర్ వీధుల్లో నిలబడి, కలబడి సాధించుకున్న అపూర్వ విజయం. జులై 20న జరిగిన ‘ఛలో పార్లమెంట్’లో పాల్గొన్న వారి సంఖ్య కొన్ని వేల మందే కావచ్చును. కానీ వారు ఈ తరం ప్రతినిధులు. తమ గొంతు తాము వెతుక్కున్నవాళ్లు. తమను తృణీకరించిన ఈ వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచి తమ శక్తి ఏంటో మనకు తెలియచెప్పిన వాళ్లు. 25 జులైన కోట్లాది మంది భారతీయులు భయం భయంగా, ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తుండగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బంతిని నిరసనకారులు జంతర్ మంతర్ గ్రౌండ్‌లో క్యాచ్ పట్టగానే, సంభ్రమాశ్చర్యాలతో కేకలు వేశారు. స్టేడియం ‘ఇండియా’ దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే బిగించిన పిడికిలితో గాలిలోకి పంచులు విసురుతూ ‘మనం సాధించాం’ అంటున్న దృశ్యం ఈ దేశ ప్రజల మనోఫలకంపై చాలాకాలం ముద్రించబడి నిలచిపోగల అద్భుత దృశ్యం.

నిశ్శబ్దాన్ని ఛేదించిన యువతరం..

చరిత్ర ఈ క్షణాలను తప్పక గుర్తుంచుకుంటుంది. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చడం అనే అవమానంతో ఇది ప్రారంభమైంది. వ్యంగ్య ప్రచార వ్యాసంగంలా మొదలై, నిజమైన అర్థంలో రాజకీయ పార్టీ కాకపోయినా, 26 మిలియన్ల ఫాలోయర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వారం లోపులోనే సాధించుకుని, కేవలం డిజిటల్ వ్యక్తీకరణలతో ఆగిపోకుండా, నిజ జీవితంలోకి వచ్చి, ఉద్యమించి, జాతీయస్థాయికి తీసుకెళ్ళి, ఒక అజేయ శక్తిగా భావించుకుంటున్న ప్రభుత్వ అహంకార కొమ్ములను విరిచేసి, తమ డిమాండ్లను సంపూర్ణంగా నెరవేర్చుకున్న జెన్-జీ చరిత్ర ఇది. విద్యాశాఖ మంత్రి రాజీనామా కేవలం ఒక చిన్న ప్రతిఫలం. రాజకీయంగా, భావజాలపరంగా, మానసికంగా విద్యార్థులు, కార్యకర్తలు సాధించుకున్న దీర్ఘ కాలపు అనుకూలతలు చాలానే ఉన్నాయి.

అజేయమన్న భావనకు బ్రేక్..

వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అసేతు హిమాచలం దాకా తమ జెండాకు ఎదురు నిలిచే శక్తి ఏదీ లేదని భావిస్తోంది. వరుస ఎన్నికల విజయాలు, తాను సైగ చేస్తే మొరిగే మీడియా యంత్రాంగం, తమకున్న విస్తృత సంస్థాగత నిర్మాణం, ప్రధానమంత్రి చుట్టూ పరిభ్రమించే కేంద్రీకృత పాలన- ఏ నిరసన అయినా సరే, వీరు ముందు నిరర్థకమని ప్రజలు భావించే స్థితికి చేరింది. రాజకీయ ప్రత్యర్థులు చీలి ముక్కలు, చెక్కలయ్యారు. పౌర సమాజం రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. విద్యార్థులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఏ పోరాటం ప్రారంభించాలన్నా ప్రతీకాత్మక స్పందనల స్థాయి దాటి వెళ్లడం లేదు. భారతీయ వీధులు చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్నాయి.

కదిలిన ప్రజాశక్తి..

సుదీర్ఘకాలం సాగిన ఉక్కపోత తర్వాత పలకరించిన తొలకరి జులై 25న జంతర్ మంతర్‌లో సాక్షాత్కరించిన దృశ్యం. సమీకృత ప్రజాశక్తి, ప్రజాస్వామ్య రాజకీయాలలో తమకు దక్కాల్సిన ఫలం సాధించుకున్న క్షణం. మేరు పర్వతమంతటి అహంకారపు బుడగ బద్దలయిన సందర్భం. రైతులు ఢిల్లీ నగరాన్ని ముట్టడించిన సంవత్సరం దాకా, మణిపూర్ రావణకాష్టం సందర్భానికి అసలు వీలే చేసుకోకుండా, ప్రపంచ దేశాలలో హారతులు అందుకుంటున్న తమ ఆరాధ్య దైవం వారంలోపే పేలవమైన సెల్ఫీ వీడియోలతో ‘ఫ్రెండ్స్’ అనే స్థాయికి దిగజారారనే శోకభారంలో భక్త జన సందోహం మునిగిపోయిన సమయం. గ్రాంసీ దీనినే “ఆధిపత్య సంక్షోభం”గా పిలిచారు. వైరుధ్యాలు బద్దలవుతాయి. రాజకీయ రూపాలు సంతరించుకుంటాయి. ప్రజల బాధలు ఉద్యమాలవుతాయి. ఈ విడిపాయలు సామూహిక శక్తిగా రూపుదాలుస్తాయి. పోరాట ప్రవాహం, ఉరుకులు, పరుగులతో పోటెత్తిన నదిలా చుట్టుమడుతుంది. జంతర్ మంతర్‌లో సరిగ్గా అదే జరిగింది.

నీట్ అవకతవకలు – రగిలిన ఆగ్రహం..

మే నెలలో నీట్ ప్రశ్నాపత్రాల లీకు వ్యవహారంలో ప్రభుత్వం ప్రదర్శించిన సంస్థాగత అహంకారం, అలసత్వం, అదే నెలలో న్యాయమూర్తి అన్యాయమైన పోలిక, కలగలిపి అభిజిత్ దీప్కే వంటి యువ పరిశోధక విద్యార్థికి ఈ సామూహిక అవమానాన్ని యువత ఆయుధంగా ఎందుకు మలచుకోకూడదన్న ఆలోచనగా మారింది. నిర్భయ తిరుగుబాటుగా పరిణామం చెందింది. ఈ నిరసనకు ఉన్న ద్వంద్వ స్వభావమే దాని వైచిత్రి. అప్రయత్నంగా, సహజాతంగా వచ్చిన కోపం, నిరసన జెన్-జీ లక్షణం. దాని నుంచే ఇన్‌స్టాలో మీమ్స్ తయారు చేసే వారు వచ్చారు. ఒకరికి మరొకరితో సంబంధం లేకపోయినా నీట్ పరీక్షకు కూర్చున్న 22 లక్షల విద్యార్థులపట్ల సహానుభూతి కలిగిన విద్యార్థులు, యువకులు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు మనసులో పచ్చిగా ఉన్న గాయాల స్పృహతో వీధుల్లోకి ప్రవాహంలా కదిలొచ్చిన జనం.

విద్యార్థి సంఘాల అండ – ఉద్యమ నిర్మాణం..

కానీ తక్షణ ఆవేశకావేశాలు కాలం గడిచేకొద్ది కరిగిపోతాయి. ఎక్కువ కాలం నిలబడటం చాలా కష్టం. ఈ ఉద్యమం మరి నెల రోజులకు పైగా నిలబడిందంటే, దానికి వున్న మరో స్వభావం దానికి ఏర్పడ్డ నిర్మాణ క్రమశిక్షణ. జెన్-జీకి ఉన్న డిజిటల్ ప్రవాహ శీలతతో కలిసిపోయి పని చేసిన వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల కార్యదక్షత. ఉద్యమ నిర్వహణకు కావాల్సిన కనీస నిర్మాణ పద్ధతులు, డిమాండ్లపై పట్టు వదలకుండా బిగించగలిగిన అనుభవం అయిసా(ఏఐఎస్‌ఏ), ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి నేరుగా రణక్షేత్రంలోకి దిగిపోయారు. నక్సలైట్లను మార్చి 31 నాటికి పూర్తిగా ఏరివేస్తానని మాటలు చెప్పిన కేంద్రమంత్రి వర్గం తనలో ఒక సభ్యుడి పదవిని నక్సలైట్ల అనుబంధ సంస్థ ఏఐఎస్‌ఏ పోరాటం కారణంగా పోగొట్టుకుంది. వీరికి తోడుగా అంబేద్కరిస్టు గ్రూపులు(బాప్సా, ఏఎస్ఏ) నిలబడటం మరో కారణం. ఈ నాయకులకు నీట్ ఎప్పుడూ మెరిట్‌ను కొలిచే తటస్థ కొలమానం కాదు. నీట్ పరీక్షా నిర్మాణంలోనే దళిత, బహుజన, ఆదివాసీ బిడ్డలను ఇముడ్చుకోని స్వభావం ఉంది. లక్షల ఖర్చు పెట్టి కోచింగ్ మాఫియాకు చెల్లించి చదవలేని పేద బిడ్డలను నీట్ శిక్షిస్తుంది. కుల, వర్గ స్వభావంతో యధేచ్ఛగా పీడనను, దోపిడీని కొనసాగించే వ్యవస్థాగత కార్యక్రమాల వికృత ముగింపు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ. కాక్రోచ్ జనతా పార్టీ వ్యంగ్య రూపానికి ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు, అంబేద్కరిస్టులు కావాల్సిన సైద్ధాంతిక ‘వెన్ను’ను సమకూర్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయిల నష్ట పరిహారం, విద్యా ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పడం, నీట్‌ను వికేంద్రీకరించడం వంటి డిమాండ్లు ఈ ఉద్యమాన్ని మధ్యతరగతి ఆక్రోశం నుంచి శ్రామిక వర్గ పోరాట స్వభావం వైపుకు తీసుకువెళ్లింది.

ప్రభుత్వ నిర్బంధం – చెదరని స్థైర్యం..

ప్రభుత్వం తలపెట్టిన లీకు వ్యతిరేక చట్టం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఈ సంఘాలకు బాగా తెలుసు. ఉదారవాద మేధావులు, గాంధేయ వాదులు సోనం వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉద్యమం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. 26 రోజుల సోనం వాంగ్ చుక్, విద్యార్థుల దీక్షలు ఈ ఉదారవాద మేధావులు, మధ్యతరగతి ప్రజల నైతిక ధర్మం అంతరాత్మలను అంకుశంలా గుచ్చటం మొదలెట్టింది. ఉద్యమ ప్రతిష్టను, నైతిక నిబద్ధతను చాలా పైస్థాయిలో నిలబెట్టింది. కొంత అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికిని నైతిక సూత్రాలు, రాజ్యాల్ని కదిలించలేవు. నిర్ణయాత్మక పోరాటం జులై 20 న ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో జరిగింది. పోలీసులు వారి తడాఖా చూపిద్దామనుకున్నారు. పైగా బొద్దింకలపై చిన్నచూపు ఎలాగూ ఉండనే వుంది. లాఠీలతో, వాటర్ క్యానన్లతో, టియర్ గ్యాస్ ప్రయోగించి బ్యాటన్ ఛార్జీలతో నిరసనకారుల్ని విరుచుకుపడ్డారు. 300 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా రెండవ తప్పిదానికి పాల్పడింది. మొదటగా ‘నిరసన’ను దేశద్రోహంగా అభివర్ణించింది. రెండు ఈ దేశ యువ శక్తిని చాలా తక్కువ అంచనా వేసింది. సోనం వాంగ్ చుక్‌ను తెల్లటి పరదాల మధ్య ఆసుపత్రికి తరలించగానే విద్యార్థుల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. నిజానికి దీనికి పూర్తి విరుద్ధమైన ఫలితం వచ్చింది. ప్రజా ఉద్యమానికి అది మీటలు నొక్కింది. ప్రభుత్వం చెప్పుకునే ‘ప్రజాస్వామ్య చట్టబద్ధత’ ఏ పాటిదో ఈ దేశ ప్రజలు చవి చూశారు.

డిజిటల్ ఆయుధం – నయా పోరాట పద్ధతి..

ప్రజాస్వామ్యం అంటే బ్యాలెట్ బాక్సు వద్ద అంతమయ్యేది కాదనీ, నిరంతర జవాబుదారీతనం ఉండాలని, పౌర భాగస్వామ్యం ఉండి తీరాల్సిన ప్రక్రియ అనీ, విభేదించే హక్కును రక్షించే బాధ్యత అనీ నిరసన కారులు గుర్తు చేశారు. కొద్ది పాటి నిరసనను కూడా సహించలేని ప్రభుత్వానికి వెనుకడుగు వేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఈ నిరసనకు అత్యంత ప్రధానమైన లక్షణాలలో ఒకటి ‘డిజిటల్’కు మాత్రమే స్వంతమైన స్వభావం. ఆన్‌లైన్‌లో పెరిగిన ఈ తరం ఆ భాషనే వాడింది. పోలీసులు విసిరిన ప్రతీ లాఠీకి ఒక మీమ్ ద్వారా బదులిచ్చారు. “పోలీస్ అంకుల్! ఈ రోజు ప్రోటీన్ షేక్ తాగలేదు. లాఠీ ఛార్జ్ చేస్తే పరుగెత్తలేను” అని ఒక పాప మాట్లాడిదంటే- వారిదైన, వారికే చెందిన పేటెంట్ హాస్యం. అది వారి తరహా ‘నిరసన’. దాన్ని రికార్డ్ చేయటం, షేర్ చేయటం నిరసనలో భాగమే. ఈ రాజకీయ పార్టీలు మర్చిపోయిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఈ ఉద్యమంలోకి మనసారా ఆహ్వానించి, భాగస్వాములను చేశారు. గోదీ మీడియాకు వంద రెట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పాటలు పాడారు. నృత్యాలు చేశారు. ప్రభుత్వాన్ని, దైవ సమానుడిగా తనను తాను భావించుకుంటున్నాడని ప్రధానిని ఎగతాళి చేశారు. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులను మనసారా పలకరించి, వారిలో వారే కుంచించుకుపోయేట్లు చేశారు. ఈ ఉద్యమం వారు రెండు చోట్ల చేశారు. ఒకటి జంతర్ మంతర్‌లో, నేరుగా. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపైన. ఇది ఆధునిక యుద్ధ తంత్రం. కావాల్సిన ఆహారాన్ని, మందులను, న్యాయ సహాయాన్ని వారు టెక్నాలజీ సహాయంతోనే పొందారు. ప్రభుత్వ తప్పుడు కథనాలను తమ రీళ్ల సాక్ష్యాలతో తుత్తునియలు చేశారు.

సిద్ధాంతాలకతీతంగా ఐక్యవేదిక..

1935లో బల్గేరియన్ కమ్యూనిస్టు యోధుడు జార్జి డిమిత్రోవ్ అంతకంతకూ పెరిగిపోతున్న, లోపలికి చొచ్చుకువస్తున్న ఫాసిజాన్ని విడి, విడిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని చెప్పాడు. శ్రామిక వర్గం, కుల, మత ప్రాతిపదికగా వేరు చేయబడిన మైనారిటీ వర్గాలు, ప్రగతిశీల ప్రజాస్వామ్య ప్రియులు రాజ్యం సాగించే దౌర్జన్యానికి వ్యతిరేకంగా సంఘటితమవ్వాలని పిలుపు నిచ్చాడు. ఈ జంతర్ మంతర్‌ నిరసన డిమిత్రోవ్ సిద్ధాంతానికి 21వ శతాబ్దపు అనుసరణ. విద్యార్థులకు ఈ పాటి విజయమైన ఎందుకు దక్కిందంటే వారు ఎవరికి వారు వేర్వేరుగా పోరాడలేదు. వామపక్ష శక్తులు, అంబేద్కరిస్టులు, గాంధేయవాదులు, పౌర సమాజం, మేధావులు, కళాకారులు, రచయితలు, చారిత్రకారులు ఒక శక్తివంతమైన ఐక్య సంఘటనగా ఉన్నారు. తమ మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి, రాజ్యం జవాబుదారీతనంతో ఉండాలన్న డిమాండ్‌ను ముందుకు పట్టుకుని కదిలారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు చకచకా మార్చుకున్నారు. సోనం వాంగ్ చుక్ నిరసన దీక్షను విరమించినా, పట్టువిడువలేదు. ఎవరు స్టీరింగ్ చక్రం వెనుక ఉన్నారో ఆచరణ ద్వారా చూపించారు. ఆయనకివ్వాల్సిన మర్యాదను ఆయనకిచ్చి చాలా హుందాగా ప్రవర్తించారు.

ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక చిన్న విషయం. ఫాసిజాన్ని నిలువరించడమెలా? అన్న పాఠాన్ని గ్రహించడమే, పెద్ద విషయం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా భావించిన అంశాలు నిరపేక్ష అనబడే బరువు క్రింద కూలిపోతే, తమ సామూహిక చైతన్యంతో ఆ ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదటం మంచి విషయం. ఫాసిజం పద్మవ్యూహాన్ని ఛేదించిన అభినవ అభిమన్యులుగా పాలకులు కీటకాలుగా భావించిన యువ శక్తి ద్వారా ఇప్పటి దాకా పాండవుల్లా చోద్యం చూస్తున్న రాజకీయ పార్టీలు తమకొక దారి దొరికినందకు సంతోషించాల్సిన విషయం. బూమర్స్, మిలీనియల్స్, జెన్-జీలో తప్పులు వెతుక్కుండా, ఆధునిక పోరాట రూపాలను వెదికి పట్టుకొని తాము వాడుకోవడం ఉత్తమంగా ఉండే విషయం. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన కారణంగా రాజీనామా వార్తను ఓ విద్యార్థి పాతకాలం నాటి లౌడ్ స్పీకర్ చేత పట్టుకొని, పోలీసుల వాహనం ఎక్కి, తమ సహచర నిరసనకారులకు చెప్పాడు- అదీ పరిస్థితులకు అనుగుణంగా మారడం అంటే. ఓ పోలీసు వాహనాన్ని ముంబై నడిరోడ్డు మీద ఒంటి చేత్తో జవాన్ కూతురయిన నటి ఆపేశారు- అదీ పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడం అంటే. ఈ శిథిల వ్యవస్థ నుంచి అంత తేలిగ్గా నాశనం చేయలేని బొద్దింకలు పోరాడితే పోయేదేమి లేదని పైకి వచ్చి చూపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!