ట్రిప్పుకు రూ.6 వేల వరకు విక్రయం, అధికారుల తనిఖీలపై ప్రజల ఆశలు

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ ఆగష్టు 21 2026: అశ్వారావుపేట మండలంలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మండలంలోని పలు వాగుల నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి పగటి వేళల వరకు ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదవాగు, నెమలిపేట వాగు, జగన్నాధపురం పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. వాగుల్లో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో నింపుకుని గాండ్లగూడెం మీదుగా వాగోడ్డుగూడెం నుంచి అశ్వారావుపేట పట్టణానికి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రిప్పును సుమారు రూ.6 వేల వరకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు వినాయకపురం మార్గంలోనూ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిరంతరం ఇసుకను తరలించడం వల్ల వాగుల స్వరూపం మారిపోవడంతో పాటు భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపుపై నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా దందా కొనసాగుతున్న పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వాగుల నుంచి జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


