ఎగుమతి–దిగుమతి రేటు రూ.29 నుంచి రూ.40కు పెంచాలి: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
పొలిటికల్ పవర్, దమ్మపేట ఆగస్టు 29: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను చేరవేయడంలో జీసీసీ హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. అయితే హమాలీలకు సకాలంలో వేతన ఒప్పందం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు.
శనివారం దమ్మపేట జీసీసీ కార్యాలయంలో జీసీసీ హమాలీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. జీసీసీ హమాలీల ఎగుమతి–దిగుమతి రేట్లకు సంబంధించిన గత వేతన ఒప్పందం గతేడాది డిసెంబర్‌తో ముగిసిందన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం ఈ ఏడాది జనవరిలోనే సంబంధిత సివిల్ సప్లై అధికారులు, మంత్రి, హమాలీ యూనియన్ నాయకులతో చర్చలు జరపాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒప్పందం కుదరకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
కొత్త వేతన ఒప్పందం కోసం హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు, సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అలాగే కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న ఎగుమతి–దిగుమతి రేటు రూ.29 నుంచి రూ.40కు పెంచి కొత్త వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదు వేతన ఒప్పందాల సందర్భంగా ప్రభుత్వ అధికారులు అంగీకరించిన ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను జీసీసీ హమాలీలకు వర్తింపజేసి అమలు చేయాలని కోరారు.
హమాలీల శ్రమను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో హమాలీలను సమీకరించి మరింత విస్తృత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పిట్టల అర్జున్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, హమాలీ యూనియన్ నాయకులు భోగ్యం సత్యం, నరసయ్య, వీర్రాజు, వెంకట్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

