నూతన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొవ్వూరి రామారెడ్డి నూతనంగా
ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాతీయ జెండాకు వందనం చేసి దేశాన్ని గౌరవించడం ప్రతి భారతీయ పౌరుడి ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయాన్ని సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలో పార్టీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో పాటు జిల్లా అధికార ప్రతినిధి సబ్బేళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, మండల పోలింగ్ బూత్ కన్వీనర్ బొడ్డు ముత్యాలరావు, వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, యువజన సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
