ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అడిగింది ఒకటి... ఇచ్చింది మరోకటి...!

అడిగింది ఒకటి… ఇచ్చింది మరోకటి…!

📰 Generate e-Paper Clip

అంతా మాయ… అవినీతి అధికారుల లీల…?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి పరిశోధనాత్మక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005 అమలు అవుతోందా? లేక కేవలం పేరుకేనా? అనే ప్రశ్నలు బాధితులు, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం (RTI Act–2005) ప్రకారం సామాన్య ప్రజలు కోరుతున్న సమాచారాన్ని చట్టబద్ధంగా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాఖలైన కొన్ని ఆర్టీఐ దరఖాస్తులకు కోరిన సమాచారానికి బదులుగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అడిగిన సమాచారానికి బదులుగా వేరే సమాధానం?

2026 జూన్ 19న ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టులో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. దీనికి స్పందించిన అధికారులు అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు గానీ, శాశ్వత ఉద్యోగులు గానీ లేరని సమాధానం ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే గత పది సంవత్సరాలుగా నాయిబ్ తహసీల్దార్ క్యాడర్‌కు చెందిన అధికారి, ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి, అలాగే అతని అనుచరుడిగా భావిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి గత ఆరు సంవత్సరాలుగా అదే కార్యాలయంలో పనిచేస్తున్న విషయం ప్రజలకు, న్యాయవాదులకు, కేసు బాధితులకు, జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసిన విషయమేనని వారు పేర్కొంటున్నారు. అంతేకాక, ఏ ఉద్యోగి గురించి సమాచారం కోరారో, అదే ఉద్యోగి వద్దకే ఆర్టీఐ దరఖాస్తును పంపించడం కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తున్నారు.

కోర్టు ఆర్డర్ల వివరాలు కూడా గోప్యమా?

2026 ఫిబ్రవరి 25న ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టు నుంచి ఎన్ని కేసులకు సంబంధించి ఆర్డర్లు జారీ అయ్యాయో, వాటి సంఖ్యను తెలియజేయాలని మరో ఆర్టీఐ దరఖాస్తు చేశారు. దీనికి “మూడవ వ్యక్తికి సమాచారం ఇవ్వలేం” అంటూ సమాధానం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండే పబ్లిక్ డాక్యుమెంట్లు అని, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక కోర్టుల తీర్పులు, ఉత్తర్వులు ప్రజలు ఆన్‌లైన్‌లో కూడా పొందగలరని వారు గుర్తు చేస్తున్నారు.

గోప్యత ఎక్కడ? పారదర్శకత ఎక్కడ?

బాధితుల ఆరోపణల ప్రకారం, 2026 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్ బదిలీ అయిన తర్వాత, ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారి తన స్వహస్తాలతో సుమారు 60 కోర్టు ఆర్డర్ల వివరాలను తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ ద్వారా ఒక వాట్సాప్ గ్రూపులో బాధితులు, న్యాయవాదులకు పంపించినట్లు చెబుతున్నారు. అప్పుడు గోప్యత సమస్యగా కనిపించకపోయినా, అదే సమాచారాన్ని ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన వారికి మాత్రం “మూడవ వ్యక్తి సమాచారం” అంటూ నిరాకరించడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ ద్వారా పంపిన వివరాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఇంకా సుమారు 100 కోర్టు ఆర్డర్ల వివరాలు కూడా బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని వారు పేర్కొంటున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్: ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు. సంబంధిత అధికారుల వ్యవహారంలో పారదర్శకత లేకపోతే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!