ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 86వ వర్ధంతి కార్యక్రమం
దమ్మపేట, పొలిటికల్ పవర్, అక్టోబర్ 27: ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్ 86వ వర్ధంతిని దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ శాఖ అధికారి భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కులు, భూమి, అటవీ వనరుల పరిరక్షణ కోసం కొమరం భీమ్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కొమరం భీమ్ కేవలం ఒక పోరాట యోధుడు మాత్రమే కాదని, ఆదివాసీల ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. నిజాం పాలనలో గిరిజనులు ఎదుర్కొన్న అన్యాయాలు, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆయన ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ఆదివాసీలకు తమ భూములపై హక్కులు ఉండాలని, అడవులు, నీరు, భూమి వంటి సహజ వనరులపై వారి జీవనాధార హక్కులను కాపాడాలని ఉద్యమించారని తెలిపారు.
“జల్, జంగల్, జమీన్” నినాదంతో పోరాట స్ఫూర్తి
కొమరం భీమ్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది “జల్, జంగల్, జమీన్” అనే నినాదమని నాయకులు పేర్కొన్నారు. నీరు, అడవి, భూమిపై ఆదివాసీల హక్కులను ప్రతిబింబించే ఈ నినాదం నేటికీ గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తినిస్తోందన్నారు. ఆదివాసీల సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానం, భూమి హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.
కొమరం భీమ్ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ ప్రాంతంలోని గోండు గిరిజనులను సంఘటితం చేసి పోరాటానికి నాయకత్వం వహించారు. జోడేఘాట్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సాగించిన ఆయన ఉద్యమం ఆదివాసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని నాయకులు గుర్తుచేశారు. 1940లో జోడేఘాట్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో ఆయన ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి
ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆదివాసీలు తమ భూములు, అటవీ హక్కులు, రాజ్యాంగబద్ధమైన రక్షణల కోసం అప్రమత్తంగా ఉండాలని జేఏసీ నాయకులు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూముల పరిరక్షణకు సంబంధిత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, భూ బదలాయింపులపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొమరం భీమ్ ఆశయాలను మాటలకే పరిమితం చేయకుండా, ఆదివాసీ యువత ఆయన పోరాట చరిత్రను తెలుసుకుని హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన త్యాగం, ధైర్యం, పోరాట పటిమ ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు కోర్స వెంకటేష్ దొర, పద్దం విజయలక్ష్మి, సున్నం శ్రీనివాసరావు,మొడియం వెంకటేశ్వర్లు,కారం నాగేంద్రబాబు, కోర్స వీదరాజు, కాకా శివ శంకర్ వరప్రసాద్, పెనుబల్లి రమేష్, వెలకం బాబురావు, ఇర్ఫా వీరస్వామి, సోడియం వెంకటేశ్వరరావు, కూరం ప్రసాద్,సున్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


