డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
ఎన్నికల హామీలు అమలు చేయాలి.. రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 3: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దమ్మపేట, పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఆశా వర్కర్లు సమ్మె నోటీసులు అందజేశారు.
ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. కనీసం రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా తమ సమస్యలను అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
పట్వారిగూడెంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల నాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరారు. పలు ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
దమ్మపేటలో వైద్యాధికారికి సమ్మె నోటీసు అందజేసిన కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీతతో పాటు రాధ, నాగమణి, వరలక్ష్మి, ప్రమీల, కుమారి తదితరులు పాల్గొన్నారు. పట్వారిగూడెంలో వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రవీణ్‌కు నోటీసు అందజేయగా, శ్రీలత, నాగమణి, భాగ్యమ్మ, కృష్ణవేణి, అంజలి, జైనవి, సరోజిని తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


