పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ప్రతినిధి యర్రా నాగరాజు రెడ్డి జులై 22 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ‘ఏజెంట్ టు గవర్నమెంట్’ (ATG) కోర్టులో అక్రమాలు, అవినీతి పరాకాష్ఠకు చేరాయని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు దక్కాల్సిన న్యాయం నీరుగారిపోతోందని ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల నిబంధనలు వర్తిస్తున్నప్పటికీ, ఈ కోర్టులో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి గత 11 సంవత్సరాలుగా ఒకే సీటులో కొనసాగుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గించి గిరిజనులకు, సాధారణ రైతులకు న్యాయం చేయాలనే మంచ్యుద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్టును నిర్వహిస్తుంటే.. సదరు అధికారి మాత్రం తన స్వలాభం కోసం చట్టాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మాజీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ?
ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ బదిలీ అయిన సమయాన్ని ఆసరాగా చేసుకొని, ఏకంగా కలెక్టర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి తనకు అనుకూలమైన వారికి చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు (Orders) జారీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆధారాలతో సహా ప్రస్తుత కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఉన్నతాధికారుల నుండి ఎటువంటి చర్యలు లేకపోవడం శోచనీయం.
రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారుల అండదండలు, రాజకీయ పలుకుబడితోనే ఈ అధికారి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, కొత్తగా వచ్చే కలెక్టర్లకు ఏజెన్సీ చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్లు:
1. కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఆరోపణలపై తక్షణమే సిట్టింగ్ జడ్జి లేదా సీబీసీఐడీ (CBCID) చేత నిష్పాక్షిక విచారణ జరిపించాలి.
2. 11 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న సదరు అధికారిని తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేసి, వేరే ప్రాంతానికి బదిలీ చేయాలి.
3. ఏజెన్సీ చట్టాల ప్రకారమే భూ వివాదాలను పరిష్కరించి, బాధితులకు తగిన న్యాయం చేయాలి.
కాగా, ఈ అంశంపై ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం త్వరితగతిన స్పందించకుంటే బాధితులందరినీ ఏకం చేసి కలెక్టరేట్ ఎదుట నిరసన కాక, హైకోర్టును మరియు లోకాయుక్తను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
