
నంద్యాల జిల్లా, శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):
శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు గిరిజనుల తాగునీటి తిప్పలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న 20 చెంచు గిరిజన కుటుంబాలు గత రెండేళ్లుగా తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై స్పందించిన శ్రీశైల దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు తక్షణమే తాగునీటి కుళాయిని ఏర్పాటు చేయించి గిరిజనుల దాహార్తిని తీర్చారు.
అధికారులు పట్టించుకోకున్నా స్పందించిన ఈవో, చైర్మన్:
గతంలో ఐటీడీఏ (ITDA) అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, అయితే దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు దాతృత్వంతో స్పందించి నిమిషాల వ్యవధిలోనే దేవస్థానం సిబ్బందిని పంపించి మంచినీటి పంపు ఏర్పాటు చేయించారని గిరిజనులు కొనియాడారు.
ఈ సందర్భంగా కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై. ఆశీర్వాదం మాట్లాడుతూ చెంచుల కష్టాలను గుర్తించి వెంటనే మంచినీటి సదుపాయం కల్పించిన ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడులకు చెంచు గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చెంచు గిరిజన మహిళలు లక్ష్మి, వీరమ్మ, వీరన్న, మూగమ్మ, దేవయ్య, వెంకటేశం, మంతయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

