జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం
సెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు ప్రథమ మహాసభ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్
కరపత్రాలు ఆవిష్కరించిన నాయకులు
ముఖ్య అతిధులుగా రాష్ట్ర నేతలు హాజరు
పాత్రికేయులు తరలిరావాలని పిలుపు
అశ్వారావుపేట :
ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు, నేడు తమ మనుగడ కోసమే పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. ఉదయరాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సెప్టెంబర్ 28వ తేదీ (సోమవారం) ఉదయం 11:00 గంటలకు స్థానిక కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్‌లో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ యాదవ్ హాజరవుతున్న ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ రూపొందించిన ప్రచార కరపత్రాలను యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
*అవకాశాలు లేక.. రక్షణ కరువై..*
యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇనపనూరి ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయరాఘవేంద్ర మాట్లాడుతూ, సమాజ రక్షణలో అహర్నిశలు ముందుండే జర్నలిస్టులకు నేడు వృత్తి భద్రత, ఆరోగ్య రక్షణ కరువైందని తెలిపారు. సొంత గూడు లేక ఎంతో మంది పాత్రికేయులు అద్దె ఇళ్లలోనే జీవితాలను వెళ్లదీస్తున్నారని చెప్పారు. వార్తా సేకరణ రంగంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విలేకరులపై బెదిరింపులు, అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారడం అత్యంత విచారకరమన్నారు.
*భేదాలు వీడి.. ఏకతాటిపైకి రండి*
రాజకీయ, వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి, మన హక్కుల సాధనకు వర్కింగ్ జర్నలిస్టులంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మన సమస్యలను మనమే గొంతెత్తి చాటాలని, ఇందుకోసం ఈనెల 28న నిర్వహించే మహాసభలు వేదిక కానున్నాయని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పాత్రికేయ మిత్రులందరు ఆహ్వానితులేనని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ముఖ్య నాయకులు నూనె హనుమంతరావు, పెనుగొండ సత్యనారాయణ, నార్లపాటి సుబ్బారావు, బి రాము, మద్దు రవి కుమార్, దాది చంటి, ముల్లగిరి రమేష్, ముళ్లగిరి విజయ్, రాయల పోలయ్య, సలార్, గణేష్, కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

