పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పుళ్ళుడు తండా (వెనక తండా), బొజ్జ తండా గ్రామపంచాయతీల పరిధిలో రైతులకు పంట కుంటల (ఫార్మ్ పాండ్స్) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాళ్లూరి రవి, వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ రైతులతో కలిసి నేరుగా పంట పొలాలను సందర్శించి పంట కుంటల నిర్మాణం, వాటి ప్రయోజనాలపై వివరించారు. ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో పంట కుంటను ఏర్పాటు చేసుకోవడం అవసరమని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తున్న పంట కుంటల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు రక్షణాత్మక సాగునీరు అందించవచ్చని తెలిపారు. అలాగే భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుందని, తక్కువ వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో కూడా పంటలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. పంట కుంటల ద్వారా చేపల పెంపకం వంటి అనుబంధ ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, నేల కోతను తగ్గించి వర్షపు నీటి వృథాను నివారించవచ్చని వివరించారు. అదనంగా పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నీటి సంరక్షణతో వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి రైతు తన భూమి పరిస్థితులకు అనుగుణంగా పంట కుంట ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని పంట కుంటల నిర్మాణంపై తమ సందేహాలను నివృత్తి చేసుకుని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పొందారు.
