ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్
ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి ఎందుకు?విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత నెల 31.08.2026న జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన కేకే రాజు గారు, విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న నిరుపేదలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. జీవో No.296తో పాటు గతంలో ప్రభుత్వం జారీ చేసిన వివిధ ఉత్తర్వుల ప్రకారం, నిబంధనలకు లోబడి ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలను నిర్మించుకుని దీర్ఘకాలంగా నివసిస్తున్న అర్హులైన పేదలకు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించబడిందని ఆయన తెలిపారు. సొంత స్థలం, సొంత ఇల్లు లేక జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బుతో చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అక్కడే జీవిస్తున్న పేద కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయి నివాస భద్రత లేకపోవడం బాధాకరమని కేకే రాజు గారు అన్నారు.
చంద్రబాబు గారూ.. ఇప్పుడు మాత్రమే పేదలు ఎందుకు గుర్తొచ్చారు?
పేద ప్రజలు నిన్న మొన్న పుట్టలేదు. వారు సంవత్సరాలుగా ఇదే సమస్యతో జీవిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇళ్ల సమస్య ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే పేదల ఇళ్లపై, పేదల హక్కులపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? అని కేకే రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నికలతో సంబంధం ఉండకూడదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే ఒక మాట.. ఎన్నికలు ముగిసిన తర్వాత మరో మాట చెప్పడం ప్రజలను మభ్యపెట్టే రాజకీయంగా మారకూడదని స్పష్టం చేశారు.
ఇది ప్రజా సేవా? లేక ఎన్నికల ముందు డ్రామా?
పేదల సమస్యలను నిజంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత హడావుడి చేయకుండా ఎప్పుడో పరిష్కారం చూపాల్సి ఉండేదని కేకే రాజు అన్నారు. పేదల ఇళ్ల విషయంలో ఇన్నాళ్లు ఏం చేశారు? ఇప్పుడు అకస్మాత్తుగా పేదలపై ప్రేమ చూపించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల ముందు పేదలను గుర్తు చేసుకుని, ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ వారి సమస్యలను పక్కన పెట్టే రాజకీయాలను ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల సమస్యలను ఎన్నికల ప్రచార అంశంగా కాకుండా పాలనా బాధ్యతగా చూడాలని కేకే రాజు డిమాండ్ చేశారు. పేదలకు కావాల్సింది తాత్కాలిక హామీలు, ప్రకటనలు, రాజకీయ ప్రచారాలు కాదని, వారు నివసిస్తున్న ఇళ్లకు నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన హక్కులు, స్థిరమైన నివాస భద్రత కల్పించడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ భూముల్లో సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని అర్హతల ఆధారంగా గుర్తించి జీవో No.296తో పాటు వర్తించే నిబంధనలను పరిశీలించి, అర్హులైన వారికి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు
పేదల ఇళ్లు, వారి పిల్లల భవిష్యత్తు, వారి జీవితకాల సంపాదనతో నిర్మించుకున్న నివాసాలు ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకునే వస్తువులు కావని కేకే రాజు అన్నారు.
ప్రజల సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వానికి లక్ష్యమైతే, ప్రకటనలకే పరిమితం కాకుండా స్పష్టమైన ఉత్తర్వులు, పారదర్శకమైన ప్రక్రియ, కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పేదలపై ప్రేమ చూపించడం కాదు. పేదలకు శాశ్వత హక్కులు కల్పించండి. మాటలతో కాదు.. చేతల్లో చూపించండి. ఎన్నికల డ్రామాలు కాకుండా పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురండి అని కేకే రాజు అన్నారు. జీవితాంతం కష్టపడి చిన్న ఇల్లు నిర్మించుకున్న పేద కుటుంబం ఆ ఇంట్లో ప్రశాంతంగా జీవించే పరిస్థితి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, పేదల ఇళ్ల సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేకే రాజు డిమాండ్ చేశారు.


