తెలంగాణ జలహక్కుల పరిరక్షణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 13 2026: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని జూపాడు బంగ్లా నేషనల్ హైవే వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన హైవేపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించేందుకు వచ్చామని, అయితే తమను అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పంటలు పండాలని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో భారీగా నీటిని తరలించే అవకాశం ఉందని, తెలంగాణ వైపు మాత్రం నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావం రెండు రాష్ట్రాలపైనా ఒకేలా ఉంటుంది
ఎల్‌నినో ప్రభావం రెండు రాష్ట్రాలపైనా ఒకే విధంగా ఉంటుందని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లు సక్రమంగా నడపడం లేదని, తాము ఒత్తిడి తెచ్చిన తర్వాతే నీటి విడుదలపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. 162 కిలోమీటర్ల పొడవైన కాలువలో 102 కిలోమీటర్ల వరకు నీరు చేరలేదని ఆయన పేర్కొన్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతున్నప్పటికీ రైతులకు నీటి విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.
రైతులకు నీటి విషయంలో స్పష్టత ఇవ్వాలి
ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో రైతులకు స్పష్టత ఇవ్వలేదని, ప్రజలకు వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్లడంలో తప్పేమిటని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన పంటలకు ప్రస్తుతం నీటి కొరత ఉండాల్సిన అవసరం లేదని, వానాకాలం పంటలకు నీరు అందించేందుకు ఇబ్బంది లేదని అన్నారు. జూరాలపై ఆధారపడిన పంపులను అవసరానికి అనుగుణంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటి తరలింపు జరుగుతోందని ఆరోపణ
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో 100 టీఎంసీల నీరు ఉన్న సమయంలో కూడా రైతులకు సుమారు 40 టీఎంసీల నీటిని అందించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 8–9 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా సుమారు 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీరు అందుతున్నప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించిన ఆయన, తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ పోలీసుల చర్యను ఖండించిన నిరంజన్ రెడ్డి
తాము ఆందోళన చేయడానికి రాలేదని, వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు మాత్రమే పోతిరెడ్డిపాడుకు వచ్చామని నిరంజన్ రెడ్డి తెలిపారు. తమను పోతిరెడ్డిపాడు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఏపీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని, పాలమూరు ప్రాంత రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉందని పేర్కొన్నారు.

