ePaper
Friday, November 6, 2026
📄 ePaper

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం..
ప్రజాస్వామ్యంలో పాలకులను గద్దెనెక్కించేది ప్రజల సంక్షేమాన్ని కాపాడటం కోసం, వారి జీవనోపాధిని పరిరక్షించడం కోసం. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను, శాస్త్రీయ అధ్యయనాలను, ప్రజా ఆకాంక్షలను, సులువైన ప్రత్యామ్నాయ మార్గాలను పూర్తిగా పక్కనబెట్టి, పాలకులు అమలు చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు కేవలం ‘అభివృద్ధి’ ముసుగులో జరుగుతున్న వినాశనానికి అద్దం పడుతున్నాయి.

దీనికి తాజా నిదర్శనమే ‘మున్నేరు-పాలేరు లింక్ కెనాల్’ ప్రాజెక్టు ( జీవో నం.98/2025) ప్రతిపాదన. ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండలాన్ని, అక్కడి మూలవాసులను శాశ్వత సంక్షోభంలోకి నెట్టే ఈ ప్రాజెక్టుపై ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా, పాలకుల వైఖరిలో మార్పు రాకపోవడం అత్యంత గర్హనీయం. ప్రతిపాధిత ‘మున్నేరు-పాలేరు లింక్ కాలువ 9.6 కిలోమీటర్ల పొడవుతో గార్ల మండలంలోని దుబ్బాగూడెం, మద్దివంచ గ్రామాల మద్య వున్న మున్నేరు చెక్ డ్యామ్ నుండి ప్రారంబమై గార్ల మండలంలోని కంసాలి తండా వద్ద సీతారామా కాలువలో కలసి ముగుస్తుంది.

ఈ లింక్ కాలువతో గార్ల ఏజెన్సీ మండలానికి ఏ ప్రయోజనం (సున్న ప్రయోజనం) లేనప్పటికీ, అనేక మాయోపాయాలతో, కుట్రలు కుతంత్రాలతో మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పూర్తి చేసి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవాలని చూడడం అత్యంత హేయమైన నీతి బాహ్యమైన చర్య.
మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండలంతో సహా మున్నేరు పరివాహక ప్రాంతం శాశ్వత నీటి హక్కులను పూర్తిగా కోల్పోనుంది. వందలాది ఎకరాల పచ్చని సాగు భూములు ధ్వంసమై, చిన్న, సన్నకారు గిరిజన రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి, రోడ్డున పడే దుస్థితి దాపురిస్తుంది. తరతరాలుగా ప్రకృతితో, అడవితో, వ్యవసాయంతో మమేకమై బతుకుతున్న గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి మనుగడ నాశనమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాక, ఈ కాలువ ద్వారా నీటిని తోడేయడం వల్ల పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి, భావి తరాలు తీవ్ర తాగునీటి, సాగునీటి కటకటను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉపాధితో పాటు పర్యావరణానికి జరిగే ఈ తీవ్ర నష్టం వల్ల మున్నేరు పరివాహక ప్రాంతం కోలుకోలేని శాశ్వత వెనుకబాటుతనంలోకి నెట్టివేస్తుంది.
పెద్దమొత్తంలో మున్నేరు సహజ నీటి ప్రవాహాన్ని అశాస్త్రీయంగా, అనాలోచితంగా మళ్ళించడం ద్వారా మానవ ప్రేరేపిత విధ్వంసాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమై “మున్నేరు మృతుల దిబ్బ” గా మారే ప్రమాదం లేకపోలేదు. రెండు నెలల వరద జలాల కోసం ఎల్లకాలం పంటలు పండే సారవంతమైన వందల ఎకరాల పంట భూములను విధ్వంసానికి గురి చేయడం రాజ్యాంగ విరుద్ధమే గాక, ప్రకృతి విరుద్ధం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార పూరిత ఏకపక్ష ధోరణి వల్ల గార్ల మండల ఏజెన్సీ ప్రాంతం త్రిభుజాకార జలసంధిలో బంధించబడుతుంది. ఒకపక్క మున్నేరు, ఇంకో పక్క సీతారామ కాలువ, మరోపక్క మున్నేరు-పాలేరు లింకు కాలువ, ఈ మూడు జల ప్రవహాల మధ్య గార్ల ఏజెన్సీ ప్రాంతం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కంటిముందే అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం గాని, ఉన్నతాధికారులు గాని పట్టించుకోకపోవడం అవగాహన లోపమా! ఆధిపత్య ధోరణా! అనేది వారి విజ్ఞతకే తెలుసు. నిజంగా మున్నేరు నీళ్లను పాలేరుకు తరలించాలనే సదుద్దేశం ఉంటే, ఏజెన్సీని ముంచకుండానే పాలకులకు అనేక అద్భుతమైన, శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

డోర్నకల్ మున్నేరు లిఫ్ట్: సీతారామ కాలువ డోర్నకల్ వద్ద మున్నేరు మీదుగానే వెళ్తుంది. అక్కడ మున్నేరుపై ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి సులభంగా పాలేరుకు నీటిని ఎత్తిపోయవచ్చు.
ఖమ్మం మున్నేరు లిఫ్ట్: ఖమ్మం వద్ద మున్నేరు మీదుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెళ్తుంది. అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసుకుని నేరుగా సాగర్ కాలువ ద్వారా నీటిని మళ్లించుకోవచ్చు.
మున్నేరు రిజర్వాయర్: ‘ముల్కనూరు – మున్నేరు రిజర్వాయర్ దశాబ్దాల కలగానే మిగిలిపోతుంది. పైన పేర్కొన్న తక్షణ మార్గాల కంటే అత్యంత శాశ్వతమైన, బహుళ ప్రయోజనకరమైన చారిత్రక ప్రత్యామ్నాయం, గత 80 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మున్నేరు రిజర్వాయర్. గార్ల మండలం ముల్కనూరు గ్రామ పరిధిలోని అలిగేరు, పాఖాలేరు సంగమం వద్ద మున్నేరుపై ఈ రిజర్వాయర్ నిర్మించాలన్న ప్రతిపాదన నాటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)లోనే స్పష్టంగా ఉంది. ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా దీన్ని తలపెట్టినా, దశాబ్దాల పాలనలో అది నెరవేరని కలగానే మిగిలిపోయింది.

మున్నేరు రిజర్వాయర్ నిర్మిస్తే బహుళ ప్రయోజనాలు గలవు. లింక్ కెనాల్ వల్ల జరిగే సర్వనాశనాన్ని పూర్తిగా నివారించవచ్చు. గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం అర్బన్ & రూరల్ డోర్నకల్, మరిపెడ, కురవి మండలాలకు సుమారు 60 వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా శాశ్వతంగా సాగు నీరు, ఆయా ప్రాంతాల ప్రజలకు త్రాగు నీరు అందించవచ్చు. ఇల్లందు, మహబూబాబాద్, ఖమ్మం పట్టణాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం లభిస్తుంది. ప్రతి ఏటా ముంపునకు గురయ్యే ఖమ్మం పట్టణాన్ని వరద ముప్పు నుండి శాశ్వతంగా రక్షించవచ్చు. మున్నేరు రిజర్వాయర్ మిగులు జలాలను పాలేరుకు తరలించడం ద్వారా పాలకులు తలపెట్టిన మున్నేరు-పాలేరు లింకు కెనాల్ ప్రయోజనం కూడా నెరవేరుతుంది.

ఇన్ని సులువైన, ప్రజాప్రయోజనకరమైన ప్రత్యామ్నాయ మార్గాలు కంటిముందు కనిపిస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా గాలికొదిలేసి ఏజెన్సీని అతలాకుతలం చేసే లింక్ కెనాల్ నిర్మాణానికే పూనుకోవడం అంటే… అది ప్రజలతో కయ్యానికి కాలుదువ్వడమే అవుతుంది! ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, నిరుపేద గిరిజనులపై తమ అధికార బలాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

మున్నేరు మృతుల దిబ్బగా మారకముందే పాలకులు, ప్రజలు మేల్కొనాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాలను పునరాలోచించుకోవాలి. గిరిజనుల ఉసురు పోసుకునే లింక్ కెనాల్ ప్రయత్నాన్ని వెంటనే విరమించి, మున్నేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలి. లేనియెడల చైతన్యవంతమైన మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజాగ్రహం ఉద్యమ రూపం దాల్చక తప్పదు!

విశ్వ జంపాల, అడ్వకేట్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు,
తెలంగాణ విద్యావంతుల వేదిక.

Latest Articles

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి!

RSETI శిక్షణతో 36 మంది గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు నెలకు రూ.20 వేల...

Related Articles

కామ్రేడ్ నీలంరామచంద్రయ్య, కా.జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ల త్యాగం చిరస్మరణీయం.. అమరుల స్ఫూర్తితో విద్యా కాషాయకరణను ప్రతిఘటిద్దాం…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :జెన్ జీ ఉద్యమాలకు దేశవ్యాప్తం మద్దతును కూడగడుదాం. నవంబర్ 5 నుండి 11 వరకు...

పట్టభద్రుల హక్కులే లక్ష్యం : టీఆర్‌ఎస్ (డి) పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణనల్లగొండ–వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్కొత్తగూడెం, నవంబర్ 5 ( ) నల్లగొండ, వరంగల్, ఖమ్మం...

*వడ్డెర భవనాల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయాలి జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్*… 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు*తెలంగాణ రాష్ట్ర మంత్రులు...
error: Content is protected !!