కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్లైన్లో పేరు నమోదు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 10 2026: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామ సంఘం వీవోఏ (VOA)గా దాదాపు 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న శ్రీధర్ పేరును తొలగించడంపై గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సంఘం తీర్మానం లేకుండానే అధికారులు ఏకపక్షంగా ఆయన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై గ్రామ మహిళలు అత్యవసర సమావేశం నిర్వహించి, శ్రీధర్ తమ గ్రామ సంఘానికి వీవోఏగా కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మాన ప్రతితో పెద్ద సంఖ్యలో మహిళలు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ప్రజావాణిలో కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామ మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, శ్రీధర్ పేరును వెంటనే ఆన్లైన్లో తిరిగి నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఏపీఎం మహేష్‌ను మహిళలు నిలదీస్తూ, తమ గ్రామ సంఘం వీవోఏ పేరును తొలగించే అధికారం ఎవరికి ఉందని ప్రశ్నించారు. దీనికి ఏపీఎం స్పందిస్తూ.. గత ఆరు నెలలుగా గ్రామంలోని ఆర్టీఏ సభ్యులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తాను నేరుగా పేరు తొలగించలేదని, విచారణ జరపాలని పై అధికారులకు నివేదిక ఇచ్చానని తెలిపారు. అయితే పై అధికారులే పేరు తొలగించారని వివరించారు. దీనిపై మహిళలు స్పందిస్తూ, శ్రీధర్ పేరును తిరిగి ఆన్లైన్లో నమోదు చేయకపోతే సెర్ప్ సీఈవోకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని చెబుతుంటే, మరోవైపు మహిళా సంఘాల అభిప్రాయాలను పట్టించుకోకుండా వీవోఏను తొలగించడం తమ హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ పరిష్కారమయ్యే వరకు గ్రామంలో రుణాల చెల్లింపులను నిలిపివేస్తామని ఏపీఎంకు స్పష్టం చేశారు. గ్రామ సంఘం మహిళల తీర్మానాన్ని గౌరవించి, తమ వీవోఏ శ్రీధర్ పేరును తిరిగి ఆన్లైన్లో నమోదు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


